Sharad Pawar: తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ మోడల్ పాలనను విస్తరించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ చేశారు. తెలంగాణను అనుకుని ఉన్న సరిహద్దు మహారాష్ట్ర గ్రామాలు తెలంగాణలో అమలు చేస్తునటువంటి పథకాలు తమకు కూడా కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ శక్తిగా ఎదగాలని బీఆర్ఎస్ పార్టీ భావింస్తోంది. రైతుల పరిస్థితి మెరుగుపరచడంపై సీఎం కేసీఆర్, తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కూడా అధికారంలోకి వస్తే మహారాష్ట్రలో ప్రవేశపెడతామని హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ప్రతీ ఇంటికి కుళాయి నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు.
Read Also: Bhatti Vikramarka : బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది..
2024 లోక్ సభ ఎన్నికల ముందు తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పాగా వేయాలనే ఉద్దేశ్యంతో ఇటీవల నాగ్ పూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. త్వరలో ముంబై, పుణే, ఔరంగాబాద్ లలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని చూస్తున్నారు. ఇటీవల నాందేడ్ జిల్లాలో జరిగిన సీఎం కార్యక్రమంలో కూడా జనాలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మహరాష్ట్రలో బీఆర్ఎస్ ఎంట్రీ అక్కడి రాజకీయ పార్టీల్లో కలవరాన్ని పెంచుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా ఎన్సీపీ చీఫ్, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్, బీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ని ‘బీజేపీ-బీ టీమ్’ అని పిలిచారు. మహరాష్ట్రలో అడుగుపెట్టడంపై శరద్ పవార్ స్పందించారు. విపక్షాల ఐక్యత గురించి శుక్రవారం మాట్లాడుతున్న క్రమంలో అక్కడి విలేకరులు బీఆర్ఎస్ మహారాష్ట్రలో అడుగుపెట్టడంపై ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ వల్ల దెబ్బతిందని అన్నారు. ప్రతీ పార్టీకి కూడా దేశంలో ఎక్కడైనా విస్తరించే హక్కు ఉందని, అయితే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ-బీ టీమా..? కాదా..? అనేది చూడాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్-ఎన్సీపీలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు.