NTV Telugu Site icon

IPL Betting: ఐపీఎల్ బెట్టింగ్‌తో రూ. కోటికిపైగా అప్పులు.. భార్య ఆత్మహత్య..

Ipl Betting

Ipl Betting

IPL Betting: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రారంభమైంది. మరోవైపు బెట్టింగ్ కూడా జోరుగా నడుస్తోంది. గతంలో బెట్టింగులకు పాల్పడి కోట్లలో డబ్బును కోల్పోయి, చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చూశాము. తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన దర్శన్ బాబు అనే ఇంజనీర్ బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయాడు. 2021 నుంచి ఐపీఎల్ బెట్టింగ్‌లు వేస్తున్నాడు. దీని కోసం అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉంటే ఇలా అప్పులు ఎక్కువ కావడంతో రుణదాతల నుంచి నిత్యం వేధింపులు ఎదుర్కొంటోన్నాడు.

Read Also: IPL 2024: ఆర్‌సీబీ ఆటగాడిపై భారత మాజీ క్రికెటర్‌ వ్యాఖ్యలు.. గట్టిగా ఇచ్చిపడేసిన బెంగళూరు ఫ్రాంచైజీ!

వేధింపులతో విసిగిపోయిన దర్శన్ బాబు భార్య ఆత్మహత్యకు పాల్పడింది. 23 ఏళ్ల రంజిత కర్ణాటక చిత్రదుర్గలో తన ఇంట్లో మార్చి 18న ఉరేసుకుని కనిపించింది. భర్త దర్శన్ హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు. 2021-2023 మధ్య ఐపీఎల్ బెట్టింగ్‌లో ఇరుక్కున్నాడు. దీంతో దంపతుల సంసారంలో అప్పులు మనస్పర్థలకు దారితీశాయి. దాదాపుగా రూ. 1.5 కోట్లకు పైగా రుణం తీసుకున్నాడని తెలిసింది. రూ. 1 కోటి అప్పు తీర్చగా.. మరో రూ. 84 లక్షల రుణం పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

దర్శన్, రంజితలు 2020లో వివాహం చేసుకున్నారు. దర్శన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న నిజాన్ని 2021లో రంజిత తెలుసుకున్నట్లు ఆమె తండ్రి వెంకటేష్ తెలిపాడు. వడ్డీ వ్యాపారుల నుంచి నిత్యం వేధింపుల వల్ల తన కుతురు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పు ఇచ్చిన 13 మంది వ్యక్తుల పేర్లను కూడా అతను పేర్కొన్నాడు. త్వరగా డబ్బులు సంపాదించవచ్చనే ఆశను చూపి తన అల్లుడిని ట్రాప్ చేసినట్లు ఆయన పేర్నొన్నాడు. పోలీసులు తమ విచారణలో సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. దర్శన్, రంజితలకు రెండేళ్ల కుమారుడు ఉన్నాడు.