Triple riding ban on bike in Mangaluru: కర్ణాటకలోని మంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బైక్ పై ముగ్గురు పురుషులు ప్రయాణించడాన్ని నిషేధించారు. ఆగస్టు 8 వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. అయితే 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. మంగళూర్ కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు కమిషనర ఎన్ శశికుమార్ వెల్లడించారు. ప్రజాకార్యకలాపాలు, వ్యాపారాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతించబడతాయని ఆయన వెల్లడించారు.
ఇటీవల కాలంలో మంగళూర్ ప్రాంతంలో వరసగా మూడు హత్యలు జరగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇటీవల బీజేపీ యువమోర్చా కార్యకర్త ప్రవీణ్ నెట్టార్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య అనంతరం మంగళూర్ ప్రాంతంలో మహ్మద్ ఫాజిల్ అనే యువకుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. అంతకుముందు కూడా హర్ష అనే భజరంగ్ దళ్ కార్యకర్తను కొంతమంది దుండగులు హత్య చేశారు. ఇలా వరసగా హత్యలు అవుతుండటంతో మతఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. దీంతో పోలీసులు సాయంత్రం నుంచి ఉదయం వరకు బైక్ పైన ముగ్గురు ప్రయాణించడాన్ని నిషేధించింది.
Read Also: Kerala: కేరళలో భారీ వర్షాలు.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.
దీంట్లో భాగంగానే.. బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు చేయడం, ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుమికూడరాదని స్పష్టం చేసింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఆందోళనలకు దిగడం, ఫోటోలు-పోస్టర్లను ప్రదర్శించడాన్ని నిషేధించారు. ఆయుధాలు పట్టుకుని తిరగడం, టపాసులు కాల్చడం, దిష్టిబొమ్మల దహనాలను నిషేధించారు పోలీసులు. ఆగస్టు 8 వరకు ప్రైవేటు ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రవీణ్ నెట్టారు హత్య తరువాత రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రవీణ్ నెట్టారు తల్లిదండ్రులను పరామర్శించేందుకు స్వయంగా వెళ్లారు.
