Boney Kapoor: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీలు నువ్వానేనా అన్న రీతిలో పోటీ పడుతున్నాయి. డబ్బు, మద్యంతో ప్రలోభాల పర్వం ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ కార్లలో పెద్ద ఎత్తున వెండి వస్తువులు బయటపడ్డాయి. ఎన్నికల కమీషన్ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తు్న్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Read Also: Sanjay Raut: అదానీ అంశంపై పవార్ వ్యాఖ్యలు.. విపక్షాల ఐక్యతపై ప్రభావితం!
కర్ణాటకలోని దావణగెరె శివారులో గల హెబ్బళు టోల్ సమీపంలో ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా బీఎండబ్ల్యూ కారులో భారీగా వెండి వస్తువులను గుర్తించారు. ఐదు బాక్సుల్లో చెన్నై నుంచి ముంబయి తరలిస్తుండగా ఇవి పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వీటికి సంబంధించి సరైన పత్రాలను చూపించలేకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 66 కిలోల వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి మొత్తం విలువ రూ. 39 లక్షల పైనే ఉంటుందని తెలిపారు.
కారు డ్రైవర్ తో పాటు ఆయనతో పాటు కారులో ఉన్న హరిసింగ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీటి గురించి ఆరా తీయగా ఈ కారు బోనీ కపూర్ కు చెందిన బెవ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థపై రిజిస్టర్ అయినట్లు తేలింది. ఈ వస్తువులు కూడా బోనీ కపూర్ కు చెందినవని హరిసింగ్ విచారణలో వెల్లడించారు.