NTV Telugu Site icon

Karnataka: కాంగ్రెస్ హామీ ఇచ్చింది.. కరెంట్ బిల్లులు కట్టం, బస్సులో టికెట్ తీసుకోం..

Karnataka

Karnataka

Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది. అయితే ఈ గెలుపులో కాంగ్రెస్ ప్రకటించిన 5 హామీలు చాలా కీలకంగా మారాయి. 200 యూనిట్లలోపు విద్యుత్ ఉచితంతో పాటు, ప్రభుత్వ రవాణా వ్యవస్థలో మహిళలకు ఉచితంగా ప్రయాణం వంటి హామీలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి ప్రజలు ఈ హామీల కోసం డిమాండ్ చేస్తున్నారు.

Read Also: AI face-swapping: AI ఫేస్-స్వాపింగ్ టెక్నాలజీతో భారీ మోసం.. స్నేహితుడిలా నటించి రూ.5 కోట్లకు టోకరా..

గ్రామాల్లో కరెంట్ బిల్లుల వసూలు చేసేందుకు వచ్చే విద్యుత్ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. మాకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది, వారే మా బిల్లులు కడుతారని ప్రజలు చెబుతున్నారు. బెళగావిలోని ఓ గ్రామంలో కొందరు వ్యక్తులు కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిరాకరించారు. కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిందని ప్రజలు చెబుతున్నారు. కొప్పల్, కలబురగి, చిత్రదుర్గ జిల్లాల్లోని గ్రామస్థులు కూడా విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొప్పల్ ప్రాంతంలో గత 6 నెలలుగా రూ.9000 విద్యుత్ బిల్లు కట్టాలని కోరిన విద్యుత్ ఉద్యోగులపై ఆ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే రాయచూర్ లో ఓ మహిళ బస్సులో టికెట్ తీసుకునేందుకు నిరాకరించింది. టికెట్ కోసం డబ్బులు ఇవ్వకపోవడంతో సదరు మహిళ బస్సు కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. బస్సు టికెట్ కొనడానికి నిరాకరించిన మహిళ.. మేము డబ్బులు చెల్లించాల్సి వస్తే కాంగ్రెస్ ఎందుకు ఉచితం అని ప్రకటించింది..? అని ప్రశ్నించింది. మస్కీ-సింథనూర్ బస్సులో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమలు చేస్తే ఏటా రూ.50,000 కోట్ల ఖజానాకు బొక్కపడుతుంది.