NTV Telugu Site icon

Eshwarappa: రాజీనామా చేసినా తప్పని తిప్పలు.. అరెస్ట్‌ చేయాల్సిందే..!

Ks Eshwarappa

Ks Eshwarappa

కర్ణాటక మాజీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను అరెస్ట్‌ చేయాలా వద్దా అనేది పోలీసులు నిర్ణయిస్తారని సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. కాంట్రాక్టర్ సంతోష్‌ పాటిల్ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిర్ణయం తీసుకునేదాకా కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఓపిక లేకపోతే ఎలా అంటూ బొమ్మై అసహనం వ్యక్తం చేశారు. వచ్చిన ఆరోపణలను సవాల్ గా తీసుకుని ఈశ్వరప్ప మంత్రి పదవికి రాజీనామా చేశారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా..? అని ప్రశ్నించారు. సిద్ధరామయ్య సీఎంగా ఉన్నప్పుడు ఒకలా… ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరోలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

Read Also: Strike: పెట్రో ధరలపై ఆగ్రహం.. రెండు రోజులు ఆటోలు, టాక్సీలు బంద్‌..

ఈశ్వరప్ప రాజీనామా అంశం ముగిసిపోయిందన్నారు మాజీ సీఎం కుమారస్వామి. ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని… అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఇక ఈశ్వరప్పను అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలు కొనసాగిస్తోంది కాంగ్రెస్. సీఎల్పీ నేత సిద్ధరామయ్య హసన్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు.