NTV Telugu Site icon

రెండోసారి సీఎంకు క‌రోనా పాజిటివ్‌.. అస్వ‌స్థ‌త‌..! ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Yediyurappa

ఇప్ప‌టికే భార‌త్‌లో ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌ను సైతం ప‌ల‌క‌రించిపోయింది క‌రోనా మ‌హ‌మ్మారి.. ఇప్ప‌టికే ఓసారి క‌రోనాబారిన ప‌డిన క‌ర్ణాట‌క సీఎం బిఎస్ యడ్యూరప్ప.. మ‌రోసారి ఆ వైర‌స్‌కు చిక్కాడు.. ఆయ‌న‌లో క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో.. ఇవాళ కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. పాజిటివ్‌గా తేలింది.. ఈ విష‌యాన్ని క‌ర్ణాట‌క సీఎంవో ప్ర‌క‌టించింది.. తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతూ రామయ్య మెమోరియల్ ఆస్ప‌త్రిలో చేరారు య‌డ్యూర‌ప్ప‌.. ఆయ‌న‌కు కోవిడ్ పాజిటివ్‌గా తేల‌డంతో.. ఇప్పుడు అక్క‌డి నుంచి మణిపాల్ ఆస్ప‌త్రికి తరలించనున్నారు.

ఇక‌, ముఖ్యమంత్రి ఇవాళ ఉదయం తన నివాసంలో రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ పరిస్థితిపై అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆరోగ్య మంత్రి కె సుధాకర్, బిబిఎంపి కమిషనర్ గౌరవ్ గుప్తా కూడా పాల్గొన్నారు… ఇక‌, య‌డ్యూర‌ప్ప.. కోవిడ్ టీకా తొలి డోస్‌ను కూడా మార్చి 12వ తేదీన తీసుకున్నారు.. అయినా ఆయ‌న రెండోసారి కోవిడ్ బారిన‌ప‌డ్డారు.. కాగా, 2020 ఆగస్టులో తొలిసారి ఆయ‌న‌కు కోవిడ్ సోకింది.. దీంతో.. ఆగస్టు 2 న మణిపాల్ ఆసుపత్రిలో చేరిన ఆయ‌న‌.. నెగిటివ్‌గా వ‌చ్చిన త‌ర్వాత ఆగస్టు 10న ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా, ఉప ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు య‌డ్యూర‌ప్ప‌.. గురువారం వరకు ప్రచారంలో ఉన్న ఆయ‌న‌. గత మూడు రోజులుగా జ్వరం, అలసటతో బాధ‌ప‌డుతూ ఆస్ప‌త్రిలో చేరారు. ఇప్పుడు కోవిడ్ పాజిటివ్‌గా తేల‌డంతో.. త‌న కుటుంబ సభ్యులు, క్యాబినెట్ సహచరులు, వ్యక్తిగత సిబ్బందితో పాటు అతనితో సన్నిహితంగా ఉన్న బ్యూరోక్రాట్లు హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని.. వెంట‌నే కోవిడ్ టెస్ట్‌లు చేయించుకోవాల‌ని సూచించారు సీఎం.