Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్

  • గురుగ్రామ్‌లో కార్గిల్ వార్ వెటరన్‌పై దాడి
  • నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
Kargil War Veteran

Kargil War Veteran

Kargil War Veteran Assaulted With Iron Rod in Gurugram: కార్గిల్ యుద్ధ వీరుడు, రిటైర్డ్ గ్రూప్ కెప్టెన్ అమిత్ కుమార్ గుప్తాపై ఇనుప రాడ్‌తో దాడి చేసిన కేసులో పార్కింగ్ అటెండెంట్‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా కోట్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దీపక్ మావీని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పార్కింగ్ వివాదం నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.

పార్కింగ్ విషయంలో వివాదం

పోలీసులు, బాధితుడి ఫిర్యాదు ప్రకారం.. సెప్టెంబర్ 10న గురుగ్రామ్‌లోని సెక్టార్ 58లో ఉన్న మాగ్నమ్ గ్లోబల్ పార్క్ వాణిజ్య సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమిత్ కుమార్ గుప్తా తన కుటుంబంతో కలిసి గోంజో రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం వెళ్లారు. రాత్రి సుమారు 8 గంటల సమయంలో కుటుంబ సభ్యులను రెస్టారెంట్‌లో వదిలి, కారు పార్క్ చేసేందుకు వెళ్లారు. అయితే పార్కింగ్ సిబ్బంది వాలెట్, బేస్‌మెంట్, మల్టీ లెవల్ పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తూ కొంతసేపు తిప్పారని గుప్తా ఆరోపించారు. చివరకు తన కారును పార్క్ చేసేందుకు నిరాకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇనుప పైపుతో తలపై దాడి

కారు రివర్స్ చేస్తున్న సమయంలో ఓ పార్కింగ్ అటెండెంట్ తన కారు ముందు అద్దాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడని గుప్తా ఆరోపించారు. దీంతో తాను కారు దిగి అడ్డుకున్నానని, ఆ తర్వాత ఆ వ్యక్తి ఇనుప రాడ్‌తో వచ్చి మొదట చేతిపై, అనంతరం తలపై కొట్టాడని అమిత్ కుమార్ గుప్తా తెలిపారు.

తీవ్ర గాయాలు.. శస్త్రచికిత్స

ఈ దాడిలో తనకు తలకు తీవ్ర గాయమైందని, మోచేయి ఎముక విరిగిందని గుప్తా తెలిపారు. ఘటన అనంతరం అంబులెన్స్‌లో గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రికి తరలించారు. అక్కడ మోచేయికి శస్త్రచికిత్స చేసి ప్లేట్ అమర్చినట్లు చెప్పారు. సెప్టెంబర్ 10 నుంచి ఆయన ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

రెస్టారెంట్ చెఫ్ జోక్యంతో పరిస్థితి అదుపులోకి

దాడి జరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బంది, పార్కింగ్ సిబ్బంది అక్కడే ఉన్నప్పటికీ ఎవరూ జోక్యం చేసుకోలేదని గుప్తా ఆరోపించారు. తాను పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ, పోలీసులు సుమారు అరగంట వరకు ఘటనాస్థలానికి రాలేదని తెలిపారు. అయితే ఓ రెస్టారెంట్ చెఫ్ జోక్యం చేసుకుని పరిస్థితి మరింత తీవ్రం కాకుండా అడ్డుకున్నారని గుప్తా పేర్కొన్నారు.

సెప్టెంబర్ 13న కేసు నమోదు

అమిత్ కుమార్ గుప్తా ఫిర్యాదు ఆధారంగా సెప్టెంబర్ 13న సెక్టార్ 65 పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తొలుత గుర్తుతెలియని వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 126(2), 351(3) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైద్యుల అభిప్రాయం ఆధారంగా మరిన్ని సెక్షన్లు చేర్చే అవకాశం ఉందని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటన సమయంలో అక్కడ ఉన్న ఇతరుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

కార్గిల్ యుద్ధంలో సేవలు

అమిత్ కుమార్ గుప్తా భారత వైమానిక దళంలో సేవలందించారు. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో భారత వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ బృందంలో ఆయన భాగస్వామిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కార్గిల్ యుద్ధ వీరుడిపై జరిగిన ఈ దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.