NTV Telugu Site icon

Kanhaiya Kumar: “తుక్డే-తుక్డే వ్యాఖ్యలు, అఫ్జల్ గురుకి మద్దతు తెలిపినందుకే కాంగ్రెస్ అభ్యర్థిపై దాడి చేశాం..

Kanhaiah Kumar

Kanhaiah Kumar

Kanhaiya Kumar: ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ అభ్యర్థిగా కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. శుక్రవారం కన్హయ్య ప్రచారం చేస్తుండగా, ఒక వ్యక్తి పూలమాల వేయడానికి దగ్గరగా వచ్చి అతని చెంపపై కొట్టాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కన్హయ్యతో పాటు ఆప్ మహిళా కౌన్సిలర్‌పై అనుచితంగా ప్రవర్తించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, దాడికి పాల్పడిన దక్ష్, అన్నూ చౌదరిలు తమ చర్యని సమర్థించుకున్నారు. 2016 జేఎన్‌యూలో కన్హయ్య చేసిన ప్రసంగం విన్న తర్వాత అతడి చెంపపై కొట్టాలని నిర్ణయించుకన్నామని వారిద్దరు వెల్లడించారు. తమకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేని వారు చెప్పారు.

నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిందితులు ఈ విషయాన్ని వెల్లడించారు. జేఎన్‌యూలో కన్హయ్య కుమార్ చేసిన ప్రసంగం విన్న రోజే అతడిని చెంపదెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నానని, పార్లమెంట్ దాడి నిందితుడు అప్జల్ గురుకు మద్దతుగా నినాదాలు చేశాడని, భారత సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడని వారు గుర్తు చేశారు. ‘‘భారత్ తేరే తుక్డే హోంగే’’ (భారత్‌ను ముక్కలుగా ముక్కలు చేస్తాం) అనే నినాదాన్ని కన్హయ్య లేవనెత్తారు, భారత సైన్యం మహిళపై అత్యాచారాలు చేస్తుందని అబద్ధాలు చెప్పాడు, ఆ సమయమే అతడికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు నిందితులు తెలిపారు.

Read Also: Suriya Kanguva: 10,000 మందితో ఆ ఒక్క వార్ సీన్.. గూస్ బంప్స్ పక్కా..

పథకం ప్రకారమే కన్హయ్య కుమార్‌పై దాడి చేసినట్లు గోసంరక్షకులైన దక్ష్, అన్నూ తెలిపారు. తాము పశ్చాత్తాపం చెందడం లేదని, దేశాన్ని రక్షించడానికి, అలాంటి ద్రోహులకు గుణపాఠం చెప్పడానికి దాడి చేశామని అన్నారు. మేము అతడిని చెంపదెబ్బ కొట్టడానికి, సిరా వేయడానికి మాత్రమే వెళ్లామని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. ఎవరి సలహా మేరకు తాము ఈ పనిచేయాలని, అతడిపై దాడి చేయడం చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదని చెప్పాడు. తాము పోలీసుల ఎదుట లొంగిపోతామని వెల్లడించారు. తుక్డే తుక్డే నినాదాలు చేసి సైన్యాన్ని అవమానించిన వాడు పార్లమెంటుకు వెళ్తాడా..? అని ప్రశ్నించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దక్ష్‌కి 4 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అన్నూకి 12,400 మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరు గత మూడు నాలుగేళ్లుగా గోసంరక్షణ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలతో ఘజియాబాద్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.