Kamal Hassan: నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి, ‘‘సనాతన’’ భావాలను ఎదుర్కొనేందుకు విద్య ఏకైక మార్గమని అన్నారు. తమిళ స్టార్ హీరో సూర్య ఏర్పాటు చేసిన అరగం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హసన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘నియంతృత్వం, సనాతన సంకెళ్లను బద్దలు కొట్టగలితే ఏకైక ఆయుధం విద్య’’ అని అన్నారు. జ్ఞానం, సాధికారత వ్యవస్థలలో ఆసక్తి పెట్టాలని విద్యార్థులకు సూచించారు.
Read Also: Witchcraft: చేతబడి అనుమానంతో వ్యక్తి ప్రైవేట్ పార్ట్ కట్ చేసి, దారుణహత్య..
‘‘మీ చేతుల్లో వేరే ఏది ఉండకూడదు, విద్య ఒక్కటే ఉండాలి. అది లేకపోతే మనం గెలవలేము, ఎందుకంటే మెజారిటీ మూర్ఖులు మనల్ని ఒడించగలరు, జ్ఞానం ఓడినట్టే కనిపించొచ్చు. కానీ అదే మన ఆస్తి. అందుకే దానిని సాధించాలి’’ అని కమల్ హాసన్ అన్నారు.
కమల్ హసన్ ‘‘నీట్’’పై తీవ్ర విమర్శలు చేశారు. పేద విద్యార్థుల వైద్య కలను నీట్ దూరం చేసిందని, 2017 తర్వాత ఎన్నో పేద కుటుంబాల పిల్లలు వైద్యులుగా మారే అవకాశాన్ని కోల్పోయారని అన్నారు. ఈ విధానం విద్యార్థులను వెనక్కి లాగుతోందని చెప్పారు. అందుకే తాము నీట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వివరించారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నాయకత్వం అంటే పదవిలో ఉండటం కాదని, సమాజంలో కలిసిపోవడమని, అది అర్థం కావడానికి 70 ఏళ్లు పట్టిందని కమల్ హాసన్ అన్నారు. సినిమాల్లో మన నటనకు కిరీటం పొందుతాము కానీ, సామాజిక సేవలో ముళ్ల కిరీటం ఇవ్వబడుతుందని, దీనిని స్వీకరించడానికి దృఢమైన గుండె కావాలని అన్నారు.