Kamal Haasan: భాషాభిమానానికి కర్ణాటక, తమిళనాడు పెట్టింది పేరు. అలాంటి చోట భాష గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఆయన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన చేసిన కామెంట్స్‌పై కన్నడిగులు ఫైర్ అవుతున్నారు.
ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘ఉయిరే ఉరవే తమిజే’’ అని ప్రారంభించారు. దీని అర్థం ‘‘నా జీవితం, నాకుటుంబం తమిళం’’. ఇదే వేదికపై కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారు. ఆయనను ఉద్దేశిస్తూ కమల్..‘‘ శివరాజ్ కుమార్ వేరే రాష్ట్రంలో నివసిస్తున్న నా కుటుంబం. అందుకే ఆయన ఈ వేదికపై ఉన్నారు. నేను నా ప్రసంగం ప్రారంభించినప్పుడు నా జీవితం, నా కుటుంబం తమిళం అని అన్నాను. మీ భాష(కన్నడ) తమిళం నుంచి పుట్టింది. కాబట్టి మీరు నా కుటుంబ సభ్యులే’’ అని అన్నారు.
Read Also: Shocking news: పిల్లలు పుట్టడం లేదని వైద్యురాలిని చంపిన అత్తామామలు.. భర్త మర్డర్ ప్లాన్..
ఈ వ్యాఖ్యలకు కర్ణాటకలో తీవ్ర స్పందన వచ్చింది. కన్నడ రక్షణ వేదిక వంటి కన్నడ అనుకూల సంస్థలు ఈ వ్యాఖ్యలను ఖండించాయి. కమల్ హాసన్ ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించాయి. కన్నడ రక్షణ వేదిక నేత ప్రవీణ్ శెట్టి మాట్లాడుతూ..‘‘ కన్నడ కన్నా తమిళం మంచిదని కమల్ హాసన్ చెబుతున్నాడు. తమిళం పుట్టిన తర్వాతే కన్నడ అంటున్నాడు. మీకు కర్ణాటకలో బిజినెస్ కావాలి..? ఇంకా కన్నడను విమర్శిస్తున్నారు’’ అని హెచ్చరించారు. ఇలాగే కన్నడ ప్రజలకు వ్యతిరేకంగా మారితే రాష్ట్రంలో మీ సినిమాను నిషేధిస్తామని అన్నారు.
కమలహాసన్ తన సినిమా ప్రమోషన్ కోసం హాజరు కానున్న బెంగళూరులోని ఒక వేదిక వద్ద కన్నడ అనుకూల సంఘాల కార్యకర్తలు గుమిగూడారు, అతనిపై నల్ల సిరా విసిరి తమ నిరసనను తెలియజేయాలని భావించారు. కమలహాసన్ తమ ప్రణాళికల గురించి తెలుసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారని నిరసనకారులు తరువాత పేర్కొన్నారు.కమలహాసన్ స్పష్టత లేదా క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో అతని చిత్రాలను బహిష్కరించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
