Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్ బై..? సొంత పార్టీ వైపు అడుగులు.. ‘ఆ ఒక్క మాట’తో షేక్ అవుతున్న తమిళ పాలిటిక్స్!

Annamalai

Annamalai

Annamalai: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహించని మలుపులతో హీటెక్కుతుంటాయి. ఇటీవల ముగిసిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తొలి ప్రయత్నంలోనే ఏకంగా 108 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ షాక్ నుంచి కోలుకోకముందే, తాజాగా బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. స్టేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కే.అన్నామలై సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? ఆయన బీజేపీని వీడి సొంతంగా కొత్త పొలిటికల్ పార్టీ పెట్టబోతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు. సోమవారం అన్నామలై అకస్మాత్తుగా చెన్నై నుంచి ఢిల్లీకి పయనం కావడం, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

సంచలనం రేపుతున్న అన్నామలై ఢిల్లీ టూర్
సోమవారం పార్టీ అగ్రనాయకత్వాన్ని కలిసేందుకు చెన్నై నుంచి ఢిల్లీకి అన్నామలై బయలుదేరారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు ఆయనను మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. “మీరు బీజేపీని వీడి కొత్త పార్టీ పెడుతున్నారట కదా?” అని నేరుగా ప్రశ్నించగా… ఈ వార్తలను ఆయన ఖండించకపోవడం గమనార్హం. దానికి బదులుగా.. “దయచేసి కొంచెం వేచి ఉండండి.. మనం రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడుకుందాం” అని అన్నామలై సమాధానం ఇచ్చారు. ఈ ఒక్క ముక్కతో ఆయన కొత్త పార్టీ పెట్టడం దాదాపు ఖాయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, అన్నామలై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వాహనానికి బీజేపీ జెండా లేకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.

×
×
Ad

చెన్నై వీధుల్లో పోస్టర్లు..
మరోవైపు జూన్ 4న అన్నామలై పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో, చెన్నైలోని ప్రధాన రహదారులు, జంక్షన్లలో ఆయన మద్దతుదారులు భారీగా పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లపై ‘మా నాయకుడా.. రా.. మమ్మల్ని నడిపించు’ అనే స్లోగన్స్ రాసి ఉన్నాయి. అన్నామలై అనుచరులు, అభిమానులు క్షేత్రస్థాయిలో ఇప్పటికే కొత్త పార్టీ కోసం గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారనడానికి ఈ పోస్టర్లే నిదర్శనంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020లో బీజేపీలో చేరారు. తన దూకుడు రాజకీయ శైలితో 2021 నుంచి 2025 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. తన ఐదేళ్ల పదవీకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, విస్తృత పర్యటనలు చేస్తూ తమిళనాడులో బీజేపీకి అత్యంత పాపులర్ ఫేస్‌గా మారారు. ముఖ్యంగా సోషల్ మీడియా యూజర్లు, యువతలో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం మారిన తమిళనాడు రాజకీయ సమీకరణాల నేపథ్యంలో, అన్నామలై తీసుకోబోయే తదుపరి అడుగుపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.