NTV Telugu Site icon

India- Canada Row: మా దగ్గర సాక్ష్యాలు లేవు.. ఒప్పుకున్న కెనడా పీఎం.. ఇండియా బిగ్ విన్..

India Canada Row

India Canada Row

India- Canada Row: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య చిచ్చుపెట్టింది. గతేడాది నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజాగా కెనడా ప్రభుత్వం ఈ హత్యలో భారత దౌత్యవేత్తల ప్రమేయం ఉందని, ముఖ్యంగా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్త సంజయ్ కుమార్ వర్మతో పాటు మరికొందరు ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా భారత్ ఫైర్ అయింది. కెనడాలోని భారత రాయబారుల్ని ఉపసంహరించుకుంది. ఇండియాలో కెనడా రాయబారుల్ని దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. గతేడాది నిజ్జర్ హత్య తర్వాత కెనడా పీఎం జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ, భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని చెప్పాడు. అయితే, దీనికి సాక్ష్యాలు సమర్పించాలని అప్పటి నుంచి భారత ప్రభుత్వం అడుగుతూనే ఉంది.

ఇదిలా ఉంటే, తాజాగా తమ వద్ద సాక్ష్యాలు లేవని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో అంగీకరించాడు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్స్ ఉన్నాయి తప్పితే, బలమైన సాక్ష్యాలు లేవని అన్నారు. ‘‘కెనడాతో పాటు ఫైవ్ ఐస్ మిత్రదేశాల నుంచి ఇంటెలిజెన్స్ ఉందని, ఇందులో భారత ప్రమేయం ఉందని స్పష్టంగా ఉంది. కెనడియన్ గడ్డపై కెనడియన్‌ని చంపేశారు’’ అన్నాడు.కెనడా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్‌లతో కూడిన ఫైవ్ ఐస్ నెట్‌వర్క్ నిఘా మరియు సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ (SIGINT)పై దృష్టి పెడుతుంది.

Read Also: Mahesh Kumar Goud: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? కేటీఆర్ కు పీసీసీ చీఫ్ సవాల్..

మోడీ ప్రభుత్వాన్ని విమర్శించే కెనడియన్ల సమాచారాన్ని సేకరించే పనిలో భారత దౌత్యవేత్తలు ఉన్నారని, ఈ డేటాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి పంపించారని, బిష్ణోయ్‌తో పాటు భారత సీనియర్ అధికారులు, నేరసంస్థలకు పంపినట్లు ట్రూడో ఆరోపించాడు. 2023 బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా వెలుపల నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఈ హత్యలో ఆరుగురు భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ ఆరోపించింది. అయితే, జస్టిన్ ట్రూడో ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, ఖలిస్తానీ సిక్కుల ఓట్లు పొందేందుకు ఈ తరహాలో భారత్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది.

భారత్‌కి పెద్ద విజయం:

గతేడాది కాలంగా కెనడా నుంచి భారత్ సాక్ష్యాలను కోరుతోంది. కెనడా ఈ సాక్ష్యాలను ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని భారత్ పలుమార్లు ఆ దేశం దృష్టికి తీసుకెళ్లింది. తాజాగా కెనడా ప్రధాని ఇలా సాక్ష్యాలు లేవని ఒప్పుకోవడం భారత్‌కి ఘన విజయమని చెప్పవచ్చు. కెనడియన్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్‌మాన్ మాట్లాడుతూ.. ఇది భారతీయ కథనానికి ఒక పెద్ద విజయమని అభివర్ణించాడు.

దీనిపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. తాము గత ఏడాది కాలంగా ఇదే విషయాన్ని చెబుతున్నట్లు పేర్కొంది. ‘‘ఈ రోజు కెనడా పీఎం చెప్పిన విషయాన్ని, మేము నిరంతరంగా చెబుతూనే ఉన్నాము. కెనడా భారత్ మరియు భారత దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా తీవ్రమైన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సాక్ష్యాధారాలను అందించలేదు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కెనడా-భారత్ మధ్య దౌత్యవివాదానికి పీఎం ట్రూడోనే బాధ్యత వహించాలని చెప్పింది.