NTV Telugu Site icon

West Bengal: 61 రోజుల్లో నిందితుడికి మరణశిక్ష.. బాలిక హత్యాచారం కేసులో సంచలనం..

Death Penalty

Death Penalty

West Bengal: 9 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన 19 ఏళ్ల నిందితుడికి పశ్చిమ బెంగాల్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. నేరం జరిగిన 61 రోజుల తర్వాత నేరారోపణ రుజువు కావడంతో అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని జైనగర్‌లో అక్టోబర్ 04న 9 ఏళ్ల బాలిక ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో ముస్తాకిన్ సర్దార్ అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు.

అదే రోజు రాత్రి ఆమె కుటుంబీలకు జైనగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షులు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా 2.5 గంటల్లో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. బాలిక మృతదేహం స్వాధీనం చేసుకున్న తర్వాత, ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేసింది.

Read Also: Rajasthan: శ్రీకృష్ణ టెంపుల్‌కు రికార్డ్ విరాళాలు.. కేజీ గోల్డ్, రూ.23 కోట్ల నగదు

అక్టోబర్ 30న లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద చార్జిషీట్ దాఖలు చేశారు. రికార్డు సమయంలో కేవలం 25 రోజుల్లోనే దర్యాప్తు పూర్తయింది. నవంబర్ 04న విచారణ ప్రారంభమైంది. నవంబర్‌ 26న విచారణ ముగించే సమయానికి 36 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు రికార్డ్ చేసింది. ఈ తీర్పును బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వాగతించారు. మహిళపై నేరాలను తమ ప్రభుత్వం ఎప్పుడూ సహించదని ఆమె ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన సమయంలోనే ఈ ఘటన జరగడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ బీజేపీ ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. తాజాగా ఈ కేసులో నిందితుడు సర్దార్‌కి మరణశిక్ష విధిండచంతో పాటు మైనర్ బాలిక కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.