NTV Telugu Site icon

Bombay High Court: “తెలివి తక్కువగా ఉంటే తల్లి అయ్యే హక్కు లేదా..?” అబార్షన్‌పై బాంబే హైకోర్ట్..

Termination Of Pregnancy

Termination Of Pregnancy

Bombay High Court: మేధో వైకల్యం ఉన్న మహిళకు తల్లి అయ్యే హక్కు లేదా..? అని బాంబే హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. 27 ఏళ్ల యువతి మానసిక స్థితి సరిగా లేదని, అవివాహితురాలు కావడంతో 21 వారాల గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆమె తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఆర్‌వి ఘుగే, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తన కుమార్తె గర్భాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు కూడా పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఈ కేసుపై జేజే ఆస్పత్రిలో వైద్య బోర్డు ద్వారా మహిళను పరీక్షించాలని గత వారం కోర్టు ఆదేశించింది. బుధవారం మెడికల్ బోర్డు సమర్పించిన నివేదిక ప్రకారం.. మహిళ మానసికంగా అస్వస్థతకు గురికాలేదు , అనారోగ్యంతో లేదని చెప్పింది. అయితే, 75 శాతం ఐక్యూతో కాస్త మేధో వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. మహిళ తల్లిదండ్రులు ఆమెకు ఎలాంటి మానసకి కౌన్సిలింగ్ లేదా చికిత్స చేయించలేదని 2011 నుంచి మందులు వాడుతూనే ఉన్నారని బెంచ్ గుర్తించింది. పిండంలో అసాధారణ, క్రమరహిత పెరుగుదల లేని, గర్భం కొనసాగించేదుకు ఆ మహిళ వైద్యపరంగా ఫిట్‌గా ఉందని మెడికల్ బోర్డు నివేదిక పేర్కొంది. అయితే, ప్రెగ్నెన్సీ రద్దు చేయవచ్చని కూడా నివేదిక పేర్కొంది.

Read Also: Pawan Kalyan: భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మోడీ మార్చారు

అయితే, ప్రెగ్నెన్సీ రద్దు విషయంలో గర్భిణీ స్త్రీ సమ్మతి చాలా ముఖ్యమని అదనపు ప్రభుత్వ ప్లీడర్ ప్రాచీ తాట్కే కోర్టుకు చెప్పారు. ‘‘ నివేదికలో ఆమె సగటు తెలివితేటలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఎవరూ కూడా సూపర్ ఇంటెలిజెంట్ కాలేదు. మనమందరం మనుషులం, ప్రతీ ఒక్కరికి ఒక్కో స్థాయి తెలివితేటలు ఉంటాయి’’ అని కోర్టు పేర్కొంది. ‘‘ఆమె సగటు కంటే తక్కువ తెలివితేటలు ఉన్నందున, ఆమెకు తల్లిగా ఉండే హక్కు లేదా..? సగటు కన్నా తక్కువ తెలివితేటలు ఉన్న వారికి తల్లిదండ్రులుగా ఉండే హక్కు లేదని మేము చెబితే అతి చట్టవిరుద్ధం’’ అని హైకోర్టు పేర్కొంది.

మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని నిబంధనల ప్రకారం, మహిళ మానసిక అనారోగ్యంతో ఉన్న సందర్భాల్లో 20 వారాల గర్భధారణ కాలానికి మించి గర్భం దాల్చడానికి అనుమతి ఉందని పేర్కొంది. ఈ కేసులో మహిళ పరిస్థితిని మానసిక రుగ్మతగా చెప్పలేమని బెంచ్ చెప్పింది. తన గర్భాణికి కారణమైన వ్యక్తి, అతడితో సంబంధం గురించి మహిళ తన తల్లిదండ్రులకు చెప్పినట్లు పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు చెప్పారు. మహిళను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఆ వ్యక్తిని సంప్రదించాలని మహిళ పేరెంట్స్‌కి కోర్టు సూచించింది. వారు ఇద్దరు పెద్దవారని, ఇదేం నేరం కాదని కోర్టు పేర్కొంది. తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని చెప్పింది. తదుపరి విచారణను జనవరి 13కి కోర్టు వాయిదా వేసింది.

Show comments