హర్యానా ఫలితాల తర్వాత ఇండియా కూటమి అప్రమత్తమైంది. సాగదీతలు.. నిర్లక్ష్య ధోరణికి స్వస్తి పలికినట్లు తెలుస్తోంది. హర్యానా పరిస్థితులు మళ్లీ రిపీట్ కాకూడదని ముందు జాగ్రత్తగా సీట్ల పంపకాలపై కూటమి దృష్టి పెట్టింది. అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు పూర్తి చేశాయి.
జార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం హేమంత్ సోరెన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మిత్రపక్షాల నేతలు సమావేశమై సీట్ల పంపకాలపై చర్చించారు. సామరస్యంగా సీట్లు పంపకాలు పూర్తయ్యాయి. కాంగ్రెస్-జేఎంఎం పార్టీలు 70 సీట్లలో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. మిగతా 11 స్థానాల్లో మిత్రపక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి పని చేస్తోంది.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్‌డీఏ గేమ్‌ప్లాన్‌ను వెల్లడించిన ఒక రోజు తర్వాత ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ప్రకటన వచ్చింది. ఇక బీజేపీ 68 స్థానాల్లో, ఏజేఎస్‌యూ 10 స్థానాల్లో పోటీ చేయనున్నట్టు శర్మ ప్రకటించారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు జేడీయూ ఒకటి, ఎల్జేపీ రెండు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మాజీ సీఎం బాబూలాల్ మరాండీ, ఏజేఎస్‌యూ చీఫ్ సుదేష్ కుమార్ మహతోతో కలిసి ఉమ్మడి ప్రెస్‌మీట్‌లో శర్మ సీట్ల భాగస్వామ్య ప్రకటన చేశారు.