Jeetendra Mishra: అయోధ్య రామ మందిర కొత్త సీఈఓగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు తొలి సీఈఓగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. రామ మందిర పరిపాలనా, ఆర్థిక, న్యాయపరమైన నిర్వహణను ఆయన నిర్వహించనున్నారు. రామ మందిర విరాళాల చోరీ వ్యవహారం మధ్య ఈ నియామకం జరిగింది.
ఎవరీ జితేంద్ర మిశ్రా..?
దాదాపు 39 ఏళ్ల పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించిన జితేంద్ర మిశ్రా, ఉత్తర్ ప్రదేశ్ లోని దేవరియా జిల్లా భట్పార్ రాణి పోలీస్ స్టేషన్ పరిధిలోని భోపత్‌పురా గ్రామానికి చెందినవారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (పూణె), ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్స్ స్కూల్ (బెంగళూరు), ఎయిర్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్ (USA) మరియు రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ (UK)లలో చదువుకున్నారు. జితేంద్ర మిశ్రా 1986 డిసెంబర్ 6న ఫైటర్ పైలర్‌గా భారత వైమానిక దళంలోకి ప్రవేశించారు. 2026లో ఏప్రిల్‌లో ఆయన 40 ఏళ్ల సుదీర్ఘ సేవల తర్వాత రితటైర్ అయ్యారు. 3000 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఆయన సొంతం. ఫైటర్, ట్రాన్స్‌పోర్ట్ విమానాలు, హెలికాప్టర్లు కలిపి 18కి పైగా రకాల విమానాలను నడిపారు.
ఆపరేషన్ సిందూర్ హీరో:
ఆపరేషన్ సిందూర్ సమయంలో జితేంద్ర మిశ్రా వైమానిక దళ వెస్ట్రన్ కమాండర్‌కరు ఆఫీసర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. ఆపరేషన్ సిందూర్‌లో ఈయన నాయకత్వంలోనే పాకిస్తాన్‌పై దాడులు జరిగాయి. ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌లో డిప్యూటీ చీఫ్ (ఆపరేషన్స్), డిప్యూటీ చీఫ్ (డాక్ట్రిన్, ఆర్గనైజేషన్ అండ్ ట్రైనింగ్) వంటి కీలక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. అదేవిధంగా ఎయిర్‌క్రాఫ్ట్ అండ్ సిస్టమ్స్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ASTE) కమాండెంట్, చీఫ్ టెస్ట్ పైలట్‌గా కూడా పనిచేశారు.314 కిలోమీటర్ల పరిధిలో పాకిస్తానీ AWACSను కూల్చివేయడానికి S-400 వ్యవస్థకు అనుమతి ఇచ్చినట్లు ఇటీవల ఆయన చెప్పారు.
కార్గిల్ యుద్ధ సమయంలో సేవలు:
కార్గిల్ యుద్ధ సమయంలో కూడా మిశ్రా కీలక పాత్ర పోషించారు. మిరాజ్-2000 యుద్ధ విమానాల్లో లేజర్ గైడెడ్ బాంబులను ఉపయోగించే ఆపరేషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఫ్రాన్స్‌లో జరిగిన గరుడ-4 వైమానిక విన్యాసాల్లో భారత వైమానిక దళ బృందానికి నాయకత్వం వహించారు. ఈయన సేవలకు గానూ అతి విశిష్ట్ సేవా మెడల్ (AVSM), విశిష్ట్ సేవా మెడల్ (VSM) లభించాయి. ఆపరేషన్ సింధూర్‌లో ఆయన పాత్రకు గుర్తింపుగా 2025లో సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ (SYSM) అందుకున్నారు.

