బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం అభ్యర్థుల ప్రకటన కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 101 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా జేడీయూ కూడా తుది జాబితాను విడుదల చేసింది. బుధవారం 57 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేయగా.. గురువారం మరొకసారి 44 మందితో కూడిన తుది జాబితాను విడుదల చేసింది. చిరాగ్ పాస్వాన్ కోరిన నాలుగు స్థానాలకు కూడా జేడీయూ అభ్యర్థులను ప్రకటించేశారు. ఈ పరిణామం ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ట్రంప్‌ను చూసి మోడీ భయపడ్డారు.. రాహుల్‌గాంధీ ఎద్దేవా
నితీష్ కుమార్ పార్టీ ప్రకటించిన మొదటి జాబితాలో సోన్‌బార్సా, మోర్వా, ఎక్మా, రాజ్‌గిర్ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలను చిరాగ్ పాస్వాన్ కోరారు. ఇది ప్రస్తుతం దుమారం రేపే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ కూడా 14 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించింది.
జేడీయూ అభ్యర్థుల జాబితాలో 37 మంది OBC అభ్యర్థులు, 22 మంది EBC అభ్యర్థులు, 22 మంది జనరల్ కేటగిరీ నుంచి, 15 మంది SC అభ్యర్థులు, ఒకరు 1 ST అభ్యర్థి ఉన్నారు. అదనంగా 4 ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది.
ఇది కూడా చదవండి: Bengaluru: వైద్య వృత్తికే మాయని మచ్చ.. భార్యకు అనస్థీషియా ఇచ్చి చంపిన డాక్టర్
2020 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన మంత్రి సుమిత్ సింగ్‌ను ఈసారి చకై అసెంబ్లీ స్థానం నుంచి నామినేట్ చేసింది. నామినేట్ చేయబడిన ఇతర మంత్రుల్లో చైన్పూర్ స్థానం నుంచి జామా ఖాన్, అమర్పూర్ నుంచి జయంత్ రాజ్, ధమ్దాహా నుంచి లెస్సీ సింగ్ ఉన్నారు. వశిష్ఠ సింగ్ కార్గహర్ నుంచి నామినేట్ చేయగా.. బులో మండల్ గోపాల్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.
