HD Kumaraswamy: కర్ణాటకలో బీజేపీ, మిత్రపక్షం జేడీఎస్ మధ్య విభేదాలు చెలరేగాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థలాల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ బెంగళూర్ నుంచి మైసూర్ వరకు పాదయాత్ర పిలుపునిచ్చింది. అయితే, ఈ పాదయాత్రకు బీజేపీకి కుమారస్వామి పార్టీ మద్దతు ఇవ్వడం లేదు. పాదయాత్రలో జేడీఎస్‌ని ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకోనప్పుడు మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి..? అని ఆయన విలేకరులతో అన్నారు.
Read Also: Ismail Haniyeh: హమాస్ చీఫ్ హనియే హత్యపై తీవ్రంగా స్పందించిన ఇరాన్..
తన అన్న కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వ్యవహారం హసన్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యవహారం వెలుగులోకి రావడానికి బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ కారణమంటూ ఆ సమయంలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ పాదయాత్రకు హసన్ జిల్లా నుంచి నేతృత్వం వహించేందుకు ప్రీతం గౌడను బీజేపీ ఎంపిక చేయడంపై జేడీఎస్ అసంతృప్తిగా ఉంది. అతడిని ఎంపిక చేయడంపై తాను బాధపడ్డానని కుమారస్వామి అన్నారు. ప్రీతం గౌడ దేవెగౌడ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు, పాదయాత్రపై చర్చించే సమావేశంలో అతడిని పక్కన కూర్చోబెట్టుకోవడం నాకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. హసన్‌లో ఏం జరిగిందో బీజేపీకి ఏమైనా తెలుసా..? అంటూ కుమారస్వామి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి సతీమణి పార్వతితో సహా భూములు కోల్పోయిన వారికి మోసపూరితంగా స్థలాలు కేటాయించిన ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు పాదయాత్ర నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే, భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాదయాత్రను నిర్వహించేందుకు ఇది సరైన సమయం కాదని అన్నారు.