Javed Ahmed Mattoo: హిజ్బుల్ ముజాహిదీన్‌కి చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు. కేంద్ర ఏజెన్సీల సమన్వయంతో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ టీం మట్టూను అరెస్ట్ చేసింది. ఇతను జమ్మూకాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రసంస్థ తరుపున పనిచేస్తున్నాడు. పోలీసులు మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్‌లు, దొంగలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన 11 ఉగ్రదాడుల్లో మట్టూ వాంటెడ్‌గా ఉన్నాడు. కేంద్రం ఏజెన్సీలకు టాప్-10 టార్గెట్లలో ఒకడు. ఇతనిపై రూ. 10 లక్షల రివార్డు ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో గాయపడిన మట్టూ అండర్‌గ్రౌండ్స్ లోకి వెళ్లారు. ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ ఐఎస్ఐ సూచన మేరకు నేపాల్ పారిపోయాడు. ఆయుధాల కోసం మట్టూ ఢిల్లీ వస్తాడనే విశ్వసనీయ సమాచారంతో స్లీపర్ సెల్స్, ఆయుధ సరఫరాదారులపై పోలీసులు నిఘా పెట్టారు. మట్టూ పాకిస్తాన్ కి చెందిన హ్యాండర్ల్ ఆయుధాలను సమకూరుస్తాడని, ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడులకు పాల్పడుతాడని పోలీసుల వద్ద సమాచారం ఉంది.
జావేద్ మట్టూ సోపోర్ వాసి. ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇతను చాలా సార్లు పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. లోయలో 5 గ్రెనెడ్ దాడులకు పాల్పడ్డాడు. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పోలీసులను చంపడంలో ఇతర ప్రమేయం ఉంది. జమ్మూ కాశ్మీర్ కి చెందిన మట్టూ, ప్రాణాలతో ఉన్న చివరి A++ టెర్రరిస్టులలో ఒకడు. తీవ్రవాదంతో పాటు సరిహద్దుల్లో ఐఎస్ఐ హ్యాండర్ల నుంచి ఆయుధాల సేకరణతో సహా, ఆర్థికంగా కూడా సహకరిస్తున్నాడు. ఇదిలా ఉంటే మట్టూ సోదరుడు గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తన ఇంటి ముందు త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన వీడియో వైరల్ అయింది.