NTV Telugu Site icon

Japanese Encephalitis: అస్సాంలో బ్రెయిన్ ఫీవర్ కల్లోలం.. 47కు చేరిన మరణాల సంఖ్య

Japanese Enchephilitis

Japanese Enchephilitis

JAPANESE ENCEPHALITIS IN ASSAM: అస్సాం రాష్ట్రాన్ని వరసగా విపత్తులను ఎదుర్కొంటోంది. గతంలో వరదల కారణంగా అస్సాం అతలాకుతలం అయింది. ప్రస్తుతం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్(బ్రెయిన్ ఫీవర్) కలవరపెడుతోంది. అస్సాంలో ఈ వ్యాధితో బాధపడుతూ చాలా మంది మరణిస్తున్నారు. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా శుక్రవారం మరో ముగ్గురు ఈ వ్యాధి కారణంగా మరణించారు. ఇప్పటి వరకు మొత్తం 47 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 294 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం కొత్తగా మరో 7 కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసుల్లో రెండు కేసులు జోర్హాట్ జిల్లాలో నమోదయ్యాయి, బొంగైగావ్, చరైడియో, దర్రాంగ్, దిబ్రూగర్, కోక్రాజార్ జిల్లాలలో ఒక్కొక్కటి నమోదు అయ్యాయి.

అస్సాంలోని 35 జిల్లాల్లోని 32 జిల్లాల్లో జపనీస్ ఎన్సెఫాలిస్ వ్యాధి బారిన పడ్డాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే వ్యాధి వెలుగులోకి వచ్చింది. డిమా హసావో, కర్బీ అంగ్లాంగ్, దక్షిణ సల్మారా జిల్లాలు మాత్రమే వ్యాధిబారిన పడలేదు. నాగావ్ జిల్లాలో అత్యధికంగా 44 కేసులు, జోర్హాట్ జిల్లాలో 39 కేసులు, గోలాఘాట్ జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అస్సాంలోని మొత్తం తొమ్మిది వైద్య కళాశాల్లలో, 10 జిల్లా ఆసుపత్రుల్లో ఐసీయూ, టెస్టింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు.

Read Also: Monkeypox: యూరప్ రకానికి భిన్నంగా ఇండియా మంకీపాక్స్ వైరస్

వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం పొంచి ఉంటుంది. సాధారణ జ్వరంగా ప్రారంభం అయ్యే జపనీస్ ఎన్సెఫాలిస్.. తరువాత మెదడు, వెన్నుపాముపై ప్రభావం చూపిస్తుంది. తీవ్ర జ్వరంతో పాటు పక్షవాతం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమ కాటు వలన వ్యాధికారక వైరస్ మానవుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. మేలో ప్రారంభమై అక్టోబర్ వరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది. అస్సాంలో ప్రతీ ఏడాది వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, మలేరియాలో చాలా మంది మరణిస్తున్నారు.