NTV Telugu Site icon

Congress: కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. 50 మంది సీనియర్ నేతల రాజీనామా..

Gulam Nabi Azad

Gulam Nabi Azad

Jammu and Kashmir Congress leaders resign: కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే కపిల్ సిబల్, జ్యోతిరాథిత్యా సింథియా వంటి నేతలు కాంగ్రెస్ పార్టీకి రాంరాం చెప్పి వేరే పార్టీల్లో చేరారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాకే అని చెప్పవచ్చు. ఆజాద్ కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల సంబంధాన్ని తెంచుకున్నారు.

Read Also: Kartikeya 2: పవన్ కోసం నిఖిల్ ని పక్కకు తప్పిస్తారా..?

తాజాగా ఆజాద్ రాజీనామాకు మద్దతుగా జమ్మూ కాశ్మీర్ అంతటా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు వరసగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్ తో సహా 50 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాజీనామాలు పంపించినట్లు సమాచారం. తారా చంద్ తో పాటు మాజీ మంత్రులు అబ్దుల్ మజిద్ వానీ, మనోహర్ లాల్ శర్మ, ఘరు రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వాన్ సింగ్‌లతో సహా పలువురు తమ పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా తమ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. సోనియా గాంధీకి తమ రాజీనామాలను పంపుతున్నట్లు తెలిపారు. దీంతో పాటు పంచాయతీ, బ్లాక్ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు , పలు మున్సిపల్ కార్పొరేటర్లు ఆజాద్ రాజీనామాకు మద్దతుగా ఇప్పటికే రాజీనామాలు చేశారు.

73 ఏళ్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పతనం అవుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీల సంస్థాగత మార్పులతో పాటు నాయకత్వం ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్న జీ-23 గ్రూపులో ఆజాద్ ప్రముఖంగా ఉన్నారు.