NTV Telugu Site icon

EAM Jaishankar: ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ మతోన్మాద మనస్తత్వాన్ని మార్చలేకపోయారు..

Eam Jaishankar

Eam Jaishankar

EAM Jaishankar: పాకిస్తాన్‌లో మైనారిటీల అణచివేతపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో మాట్లాడారు. పాకిస్తాన్‌ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరునను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని శుక్రవారం చెప్పారు. మాజీ ప్రధానమంత్రి మరియు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా గాంధీ కూడా పాకిస్తాన్ మనస్తత్వాన్ని మార్చడంలో విజయం సాధించలేరని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో, పాకిస్తాన్‌లో మైనారిటీలపై నేరాలు, దౌర్జన్యాలపై సమాధానం ఇస్తూ.. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగిన 10 దారుణ సంఘటనల్ని ఉదహరించారు. వీటిలో ఏడు కిడ్నాప్‌ చేసి బలవంతపు మతమార్పిడి, రెండు కిడ్నాప్‌లు, హోలీ జరుపుకుంటున్న విద్యార్థులపై పోలీస్ చర్యల వంటి సంఘటనల గురించి చెప్పారు.

పాకిస్తాన్‌లో సిక్కు కమ్యూనిటీకి సంబంధించి మూడు ఘటనలు, అహ్మదీయ కమ్యూనిటీకి సంబంధించి రెండు ఘటనలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక క్రైస్తవ వ్యక్తిపై దైవదూషణ కేసు నమోదైనట్లు ఆయన చెప్పారు. సిక్కు కుటుంబంపై దాడి జరిగిందని, మరొక సందర్భంలో పాత గురుద్వారా తిరిగి తెరిచినందుకు సిక్కు కుటుంబాన్ని బెదిరించినట్లు ఆయన చెప్పారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన ఒక బాలికను అపహరించి మతం మార్చినట్లు వెల్లడించారు.

Read Also: Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత

పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లోని మైనారిటీల సంక్షేమం, వారి శ్రేయస్సుని గమనిస్తున్నామని జైశంకర్ అన్నారు. 2024లో మైనారిటీలపై 2400 దాడులు జరిగాయని, 2025లో ఇప్పటి వరకు 72 సంఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తరహాలో కఠిన చర్య తీసుకోవాలని భారత్ యోచిస్తుందా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. ఒక ప్రభుత్వంగా, దేశంగా మనం పొరుగువారి మతోన్మాద మనస్తత్వాన్ని మార్చలేము అని అన్నారు.

మార్చి 26న, హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్తాన్ (HRFP) 2025 మొదటి త్రైమాసికంలో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో పాకిస్తాన్ వ్యాప్తంగా మైనారిటీలపై అకృత్యాలను పెరిగినట్లు చెప్పింది. మైనారిటీలపై జరుగుతున్న సంఘటనల్ని ఖండించింది. ఇలాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం దక్కడం లేదని ఈ రిపోర్ట్ చెప్పింది. పాకిస్తాన్‌లో మతపరమైన మైనారిటీల దాడులు, హత్యలు, దైవదూషణ ఆరోపణలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడులు పెరిగినట్లు నివేదించింది. జనవరి 2025 నుంచి ఇలాంటి ఘటనల్లో పెరుగుదల కనిపించినట్లు ఈ సంస్థ నివేదించింది.