Minster Priyank Kharge: కొద్ది రోజుల క్రితం జరిగిన జైన్ సన్యాసి హత్యకు బీజేపీ మతం రంగు పులుముతుందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. బెళగావి జిల్లాలో జైన్ సన్యాసి ఆచార్య శ్రీ కామకుమార నంది మహరాజ్ హత్యోదంతం కలకలం రేపుతోంది. జైన్ సన్యాసి హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. ఈ హత్యపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణతో జైన్ వర్గీయులు సంతృప్తిగా ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. వ్యక్తిగత కక్షతోనే జైన్ సన్యాసి హత్య జరిగి ఉండవచ్చని.. ఇందులో మత వివాదం లేదని మంత్రి ఖర్గే పేర్కొన్నారు.
Read also: Keerthy Suresh Pics: వెరైటీ స్లీవ్ లెస్ డ్రెస్‌లో కీర్తి సురేష్.. చూపులతోనే చంపేస్తుంది!
జైన్ సన్యాసిని హత్య చేసిన నిందితులను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని, కఠినంగా శిక్షిస్తుందని మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపిస్తోందని.. జైన్ వర్గీయులు సైతం ఈ విషయంలో సంతృప్తిగా ఉన్నారని మంత్రి తెలిపారు. బీజేపీకి ఎలాంటి అంశాలు లేకపోవడంతో ఈ హత్యకు మతం రంగు పులిమి రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కాగా జులై 5న ఆశ్రమం నుంచి అదృశ్యమైన జైన్ సన్యాసి శనివారం చికోడి తాలూకా హిరెకోడి గ్రామంలోని బావిలో విగతజీవిగా పడిఉండటం కలకలం రేపింది. ఆయన శరీరాన్ని ముక్కలుగా కోసిన దుండగులు బావిలో పడేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నారయణ బసప్ప మడి, హసన్ దలాయత్ అనే ఇద్దరు వ్యక్తులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి హత్య జరిగిందని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల డిమాండ్ చేశారు.