Karnataka: చేయని హత్యకు 2 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, ఇప్పుడు తనను ఈ కేసులో ఇరికించిన పోలీసు అధికారులపై చర్యలకు సిద్ధమయ్యాడు. తన భార్యను హత్య చేశాడనే ఆరోపణలపై దాదాపు రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిన ఒక గిరిజన వ్యక్తి, తనను తప్పుడు కేసులో ఇరికించిన అధికారులపై రూ.5 కోట్ల పరిహారం, క్రిమినల్ చర్యల్ని కోరుతూ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించాడు.
కర్ణాటక కుశాల్‌నగర్ తాలూకాలోని బసవనహళ్లి నివాసి కురుబర సురేష్, భార్యను హత్య చేసిన నేరం కింద జైలులో పెట్టారు. అయితే, ఇటీవల అతడి భార్య సజీవంగా కనిపించడంతో ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో 2025 ఏప్రిల్ నెలలో మైసూర్‌లోని 5వ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు పూర్తి గౌరవాలను సురేష్‌ని నిర్దోషిగా విడుదల చేసింది. కోర్టు అతడికి రూ. 1 లక్ష పరిహారం చెల్లించాలని కర్ణాటక హోం శాఖను ఆదేశించింది. అయితే, నామమాత్రపు డబ్బులపై అసంతృప్తి చెందిన సురేష్ ఇప్పుడు హైకోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖు చేశారు.
సురేష్ తన పిటిషన్‌లో అప్పటి దర్యాప్తు అధికారి ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ బిజి, అప్పటి అదనపు పోలీసు సూపరింటెండెంట్ జితేంద్ర కుమార్, సబ్-ఇన్‌స్పెక్టర్లు ప్రకాష్ యట్టిమణి, మహేష్ బికె, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ సోమశేఖరతో సహా ఐదుగురు అధికారులను చర్యలు తీసుకోవాలని కోరాడు. వారు సాక్ష్యాలను తప్పుదారి పట్టించారని, తగిన ప్రక్రియ లేకుండా తనను అరెస్ట్ చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సురేశ్ ఆరోపించారు. సురేష్ ఆ అధికారుల నుంచి నష్టపరిహారం, క్రిమినల్ చర్యల్ని కోరుతున్నాడు.
Read Also: Konidela Village: పవన్ కల్యాణ్ రూ.50 లక్షల విరాళం.. కొణిదెలలో అభివృద్ధి పనులకు శ్రీకారం
కేసు వివరాలను పరిశీలిస్తే, 2021లో సురేష్ భార్య మల్లికే కనిపించకుండా పోయింది. దీంతో అతడిపై ఫిర్యాదు నమోదైంది. 2022లో పొరుగున ఉన్న మైసూర్ జిల్లాలోని బెట్టడపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అస్థిపంజర అవశేషాలు కనిపించాయి. పోలీసులు ఆ అస్థిపంజరం మల్లికే అని అనుమానించారు. సరైన డీఎన్ఏ ఆధారాలు లేనప్పటికీ సురేష్ మల్లిగేని హత్య చేసినట్లు కేసు నమోదు చేశారు. డీఎన్ఏ పరీక్షల్లో ఆ అస్థిపంజరం మల్లిగేది కాదని తేలే వరకు 18 నెలల పాటు కస్టడీలో ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.
ఏప్రిల్ 2025లో మల్లిగే మడికేరిలోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా సురేష్ స్నేహితులు ఆమెను సజీవంగా చూశారు. ఆమెను బెట్టడపుర పోలీసులు అదుపులోకి తీసుకుని మైసూరు కోర్టులో హాజరుపరిచారు. ఆమె తిరిగి కనిపించడంతో దర్యాప్తు, పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ బిజిపై మాత్రమే చట్టపరమైన చర్య తీసుకోవాలని సెషన్స్ కోర్టు సిఫార్సు చేసినప్పటికీ, కేసులో పేర్కొన్న ఐదుగురు అధికారులపై క్రిమినల్ బాధ్యత కలిగి ఉన్నారని సురేష్ పిటిషన్ దాఖలు చేశారు. సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు సవరించి తనను “నిందితుడు”గా కాకుండా “బాధితుడు”గా అభివర్ణించాలని కూడా అతను అభ్యర్థించాడు. గత మూడేళ్లుగా మల్లికే ఎక్కడ ఉన్నారు, ఆమె అదృశ్యం చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు.
