Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రతీరోజు అక్కడ రాడికల్ ఇస్లామిస్టులు హిందువులు టార్గెట్‌గా దాడులకు తెగబడుతున్నారు. హిందువుల ఆస్తులు, దేవాలయాలు, ఇళ్లు, వ్యాపారాలు ప్రతీదాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. షేక్ హసీనా దిగిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు తీసుకున్నాక, ఈ దాడులు మరింత ఎక్కువయ్యాయి. అక్కడి ప్రభుత్వం మతోన్మాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
Read Also: PM Modi: కువైట్.. మినీ ఇండియాలా ఉంది.. హలా మోడీ ప్రోగ్రామ్‌లో ప్రధాని వ్యాఖ్య
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ నాటోర్‌లోని ఒక శ్మశాన వాటిక సమీపంలోని ఆలయంలో హిందూ పూజారి తరుణ్ చంద్ర దాస్ హత్య జరిగింది. ఈ హత్యను ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారమన్ దాస్ ఖండించారు. నేరస్తులు ఆలయంలోని విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లారు. పోలీసులు ఈ సంఘటనను దోపిడీగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం బీర్‌గంజ్ ఉపజిల్లాలోని జర్బరీ గ్రామంలో మూడు హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. హిందూ దేవీదేవతల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఇదిలా ఉంటే, క్రిస్మస్ పండగ దగ్గర పడుతుండటంతో దాడులు జరుగుతాయేమో అనే భయంలో అక్కడి క్రిస్టియన్లు ఉన్నారు. నాటోర్ ఘటన విషయాని వస్తే హిందూ పూజారి తరుణ్ చంద్ర దాస్ కాళ్లు చేతులు కట్టేసి, చిత్రహింసలకు గురి చేసి చంపినట్లు తెలుస్తోంది.
మతపరమైన మైనారిటీలను రక్షించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఇస్కాన్ కోల్‌కతా కోరింది. ఈ ఏడాదిలో హిందువులపై బంగ్లా వ్యాప్తంగా 2200 హింసాత్మక దాడులు జరిగాయని భారత విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఇటీవల పార్లమెంట్‌లో వ్రాతపూర్వకంగా తెలియజేశారు. పాకిస్తాన్‌తో పోలిస్తే ఈ ఏడాది బంగ్లాదేశ్‌లోనే హిందువులపై ఎక్కువ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం.