Site icon NTV Telugu

Custodial Death: కస్టోడియల్ డెత్పై సీఎం స్టాలిన్ క్షమాపణ.. ఒక్క సారీతో సరిపోతుందా..?

Tamilnadu

Tamilnadu

Custodial Death: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కస్టోడియల్ డెత్ కేసు కుదిపేస్తోంది. శివగంగ జిల్లాలో అజిత్ కుమార్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డును చోరీ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అనుమానితుడిని ప్రశ్నించిన పోలీసులు, హింసకు దిగారు. వారి దెబ్బలను తట్టుకోలేక అజిత్ కస్టడీలోనే మృతి చెందాడు. దీంతో పోలీసులు హింసించడంతోనే అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలో కూడా అజిత్‌పై చిత్రహింసలు జరిగినట్లు తేలింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. అజిత్ మరణానికి బాధ్యులైన ఐదుగురు పోలీసులను అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Read Also: Dil Raju: పైరసీ చేసి చిన్న సినిమాకు 400, పెద్ద సినిమాకు 100 డాలర్లకి అమ్ముతున్నారు!

ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం ఎంకే స్టాలిన్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఒక అమాయక యువకుడిని నిర్దాక్షిణ్యంగా చంపిన తర్వాత ఒకే ఒక్క పదం ‘క్షమించండి’ అని చెప్పడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి వెంటనే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే, స్టాలిన్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కస్టడీలో లేదా అనుమానాస్పద పరిస్థితులలో మరణించిన 23 మంది పేర్ల జాబితాను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలోని నామక్కల్, తిరునల్వేలి, చెన్నై, మధురై, విల్లుపురం, చెంగల్పట్టుతో సహా ఇతర జిల్లాల్లో కూడా కస్టోడియల్ మరణాలు జరిగాయని ఆరోపించారు. చనిపోయిన ఆ 23 మందికి చెందిన తల్లిదండ్రులు, భార్యలు, పిల్లలకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎప్పుడు ఫోటో షూట్ నిర్వహిస్తారు? అని తమిళనాడు బీజపీ చీఫ్ ఎగతాళి చేశారు.

Exit mobile version