iPhone-Foxconn: ఆపిల్ భాగస్వామి ఫాక్స్ కాన్ భారత్ లో భారీ పెట్టుబడి పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా నుంచి తమ వ్యాపారాన్ని ఇతర దేశాలకు మళ్లించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారుగా ఉన్న చైనాకు ఇది పెద్ద దెబ్బగా నిపుణులు పరిగణిస్తున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు భారత్ తో కొత్తగా సుమారు 700 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా రూ.5700 కోట్లతో ఫ్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక బెంగళూర్ సమీపంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. బెంగళూర్ విమానాశ్రయానికి సమీపంలో 300 ఎకరాల్లో ఈ ఫ్లాంట్ నిర్మించనున్నారు.
ఐఫోన్ విడిభాగాలను తయారు చేసేందుకు ఈ ఫ్లాంట్ ను నిర్మించాలని యోచిస్తున్నారు. అయితే ఈ ఫ్లాంట్ లో ఐఫోన్ హ్యాండ్ సెట్ల అసెంబ్లింగ్ ను కూడా చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ఫాక్స్ కాన్ ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి అడుగుపెట్టాలని అనుకుంటోంది. దీనికోసం కొన్ని భాగాలను ఉత్పత్తి చేసేందుకు ఈ ఫ్లాంట్ ను ఉపయోగించే అవకాశం ఉంది.
Read Also: Anurag Thakur: రాహుల్ గాంధీ ఇక్కడ గెలవలేక.. విదేశాల్లో విమర్శలు చేస్తున్నారు..
భారతదేశంలో ఇప్పటి వరకు ఫాక్స్ కాన్ చేసిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. ఆపిల్ లో పాటు ఇతర యూఎస్ బ్రాండ్లు భారతదేశం, వియత్నాం దేశాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ మహమ్మారి సఫ్లై చైన్ పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. దీంతో పాటు చైనా వ్యాపారులపై అనుసరిస్తున్న విధానాలు, నిర్భంద లాక్ డౌన్ల వల్ల అక్కడ పారిశ్రామిక రంగం కుదేలు అయింది. దీంతోనే చైనా నుంచి పలు కంపెనీలు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నాయి.
భారత దేశంలో కొత్తగా ఏర్పాటు అయ్యే ప్లాంట్ వల్ల దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు రావచ్చని అంచనా. చైనాలోని జెంగ్ జౌలోని ఫాక్స్ కాన్ ఐఫోన్ అసెంబ్లీ ఫ్లాంట్ లో సుమారుగా 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కోవిడ్ వల్ల జెంగ్ జౌ ఫ్లాంట్ లో ఉత్పత్తి పడిపోయింది.
అయితే ఈ ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రావల్సి ఉంది. ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియు నేతృత్వంలో ఫాక్స్ కాన్ మేనేజ్మెంట్ కు చెందిన 17 మంది సభ్యుల బృందం ఈ రోజు బెంగళూర్ విమానాశ్రయం సమీపంలోని క్యాంపస్ ను సందర్శించారు. గ్లోబల్ కంపెనీలకు బెంగళూరు ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానమని, పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా ఉందని ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లియు తెలిపారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ప్రతినిధి బృందం న్యూఢిల్లీకి వెళ్లనుంది.