Site icon NTV Telugu

Naravane Book: నరవణే బుక్‌పై అంతర్జాతీయ కుట్ర.. కేంద్ర దర్యాప్తులో ఏం తేలిందంటే..!

Naravane Book

Naravane Book

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ పుస్తకం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. పుస్తకం బయటకు రావడం వెనుక కుట్ర జరిగిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’ పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అందులోని అంశాలను లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ అడ్డుకున్నారు. అంతేకాకుండా రాహుల్ గాంధీ మాట్లాడకుండా స్పీకర్ ఓం బిర్లా కూడా మైక్ కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మరుసటి రోజు పార్లమెంట్ ఆవరణలో నరవణే రాసిన పుస్తకాన్ని ప్రతిపక్ష నేత మీడియాకు చూపించారు. దీంతో కేంద్రం ఝలక్ అయింది. కేంద్రం నుంచి అనుమతి లేకుండా పుస్తకం ప్రచురణ ఎలా జరిగిందని అవాక్కైంది. దీంతో కేంద్రం విచారణ చేపట్టింది. అలాగే ఢిల్లీ పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజాగా కేంద్ర దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నరవణే పుస్తకం లీక్ వెనుక అక్రమాలు జరిగినట్లుగా దర్యాప్తులో తేలింది. రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి లేకుండా ఒక ప్రణాళిక బద్ధంగా లీక్ అయినట్లుగా దర్యాప్తులో తేలింది. పుస్తకం ప్రింట్ కావడం.. వెంటనే ఆన్‌లైన్‌లో మొదట కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, అమెరికాలో విక్రయాలు జరగడం ప్రారంభం అయ్యాయి. అమెజాన్‌లో పుస్తకం విక్రయం జరిగినట్లుగా కేంద్రం గుర్తించింది. పుస్తకం లీక్ వెనుక భారీ స్థాయిలో కుట్ర జరిగినట్లుగా భావిస్తోంది.

లీక్ అయిన కాపీ మొదట బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతంతో అనుసంధించబడిన కంట్రీ కోడ్ డొమైన్ అయిన ఐఓ డొమైన్ టెన్షన్‌కు అప్‌లోడ్ చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. అనంతరం అనేక ఇతర హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌లకు విస్తరించినట్లుగా కనిపెట్టారు.

పుస్తకానికి చెందిన ISBN నెంబర్‌ను కూడా దర్యాప్తు సంస్థ పరిశీలిస్తోంది. ISBN అనేది ఇంటర్నేషనల్ స్టాండర్ బుక్ నెంబర్. పుస్తకాన్ని గుర్తించడానికి ఉపయోగించే 13 అంకెల డిజిటల్ కోడ్. లీక్ అయిన ISBN నెంబర్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’కి చెందినదిగా కనిపెట్టారు. ప్రస్తుతం ఈ కోడ్‌కు సంబంధించి పబ్లిషర్ పెంగ్విన్ ఇండియాను కూడా దర్యాప్తు సంస్థ విచారించనుంది. ఆశ్చర్యం ఏంటంటే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీలో ఆన్‌లైన్‌లో అమ్ముడైన ISBN కోడ్ పెంగ్విన్ ఇండియాదిగానే తేలినట్లుగా సమాచారం. మొత్తానికి అంతర్జాతీయంగా కుట్ర జరిగినట్లుగా దర్యాప్తు సంస్థ భావిస్తోంది. దీనిపై కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే ఇటీవల రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ‘‘నా పుస్తకం అందుబాటులో ఉందని మనోజ్ నరవణే ట్వీట్ చేశారు. పుస్తకం ప్రచురణ కాలేదని పబ్లిషర్ పెంగ్విన్ అయినా అబద్దం చెప్పుండాలి… లేదంటే నరవణే అయినా అబద్దం చెప్పుండాలి. నేను అయితే నరవణే ట్వీట్‌ను నమ్ముతున్నాను. పుస్తకం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. పుస్తకంలో భారత ప్రభుత్వానికి.. ప్రధాని మోడీకి అసౌకర్యంగా ప్రకటనలు ఉండొచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. నరవణే పుస్తకంపై ఎఫ్‌ఐఆర్ బుక్ అయిన తర్వాత ప్రతిపక్ష నేత ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version