Site icon NTV Telugu

Uddhav Thackeray: “బీజేపీ అవమానిస్తే మాతో చేరండి, మంత్రిని చేస్తాం”.. నితిన్ గడ్కరీకి ఠాక్రే పిలుపు..

Thackeray, Gadkari

Thackeray, Gadkari

Uddhav Thackeray: మహారాష్ట్రలో రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయం సాధింస్తుందని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర యావత్మాల్‌ జిల్లాలోని పుసాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని అవమానిస్తోందని, బీజేపీ అవమానిస్తే తమతో చేరాలని ఠాక్రే కోరారు. ఒకప్పుడు అవినీతి ఆరోపణలతో కృపాశంకర్(మాజీ కాంగ్రెస్ నేత)ని బీజేపీ లక్ష్యంగా చేసుకుందని, ఇప్పుడు ఆయనకు బీజేపీ తన మొదటి జాబితాలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిందని ఠాక్రే అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ కూడా తొలిజాబితాలో ఉన్నారని, కానీ నితిన్ గడ్కరీ పేరు లేదని చెప్పారు.

‘‘ రెండు రోజుల క్రితమే గడ్కరీకి ఈ విషయం చెప్పాను. మళ్లీ మళ్లీ చెబుతున్నాను. మీకు అవమానాలు ఎదురైతే బీజేపీని వీడి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో చేరండి. మీ గెలుపు ఖాయం, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రిని చేస్తాం.’’ అని ఠాక్రే అన్నారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్ పవార్), శివసేన(యూబీటీ) ఉన్నాయి. బీజేపీ, మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు చర్చలు పూర్తి కానందున మొదటి జాబితాలో మహారాష్ట్ర నుంచి పేర్లు ప్రకటించలేదని బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు.

Read Also: Babu Mohan: నేను పోటీచేయడంలేదు.. కేఏ పాల్‌ ఎంపీ అయితే రాష్ట్రానికి, దేశానికి మేలు..!

సీఏఏ చట్టాన్ని ఎన్నికల జుమ్లాగా ఠాక్రే అభివర్ణించారు. హిందువులు, సిక్కులు, పార్సీలు, ఇతరులు భారతదేశానికి వస్తున్నారు, అయితే త్వరలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వడం అనుమానాస్పదంగా ఉందని ఠాక్రే అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి నాలుగేళ్లు దాటిందని, అయితే జమ్మూ కాశ్మీర్‌లో ఎలాంటి ఎన్నికలు జరగలేదని, కాశ్మీరీ పండిట్లు కాశ్మీర్‌లోని తమ ఇళ్లకు ఇంకా తిరిగి రాలేదని ఆయన బీజేపీని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో మతాల మధ్య విద్వేషాలు సృష్టించి రాజ్యాంగాన్ని మార్చాలనుకునే ఆలోచనలో బీజేపీ ఉందని, మరోవైపు దేశభక్తుల కూటమైన ఇండియా కూటమి ఉందని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు దేశభక్తులకు, ద్వేష భక్తులకు జరుగుతోందని పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మణిపూర్ పర్యటించేందుకు ప్రధాని మోడీకి ఇంకా సమయం దొరకలేదని విమర్శించారు.

Exit mobile version