Site icon NTV Telugu

PM Modi: రాష్ట్రపతికి అవమానం.. కాంగ్రెస్ “రామమందిర శుద్ధి” వ్యాఖ్యలపై పీఎం ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామ మందిరాన్ని శుద్ధి చేస్తామని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బార్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ నాయకుడి ప్రకటన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మొత్తం గిరిజన సమూహాన్ని అవమానించడమే అని అన్నారు. ఒడిశాకు చెందిన గిరిజన బిడ్డను బీజేపీ రాష్ట్రపతిని చేసిందని, అయితే కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆమెను పదేపదే అగౌరపరుస్తున్నాయని అన్నారు.

Read Also: Pakistan: PIA ఎయిర్‌లైన్ నిర్లక్ష్యం.. చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది

‘‘రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఇటీవల రామ మందిరాన్ని సందర్శించారు. ఆమె మందిర గుర్భగుడిలో పూజలు చేశారు. ఆమె దేశం శ్రేయస్సు కోసం రామ్ లల్లా ఆశీర్వాదం కోరారు. మరుసటి రోజే కాంగ్రెస్ నాయకుడు రామ మందిరాన్ని గంగా జలంతో శుద్ధి చేస్తామని చెప్పాడు. ఇది దేశాన్ని, తల్లులను, సోదరీమణులను, మొత్తం గిరిజన సమాజాన్ని అవమానించడమే’’ అని ప్రధాని మోడీ అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించినందుకు ప్రతీ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు రాకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ప్రజల్ని కోరారు. రాజ్యాంగానికి వెన్నుపోటు పొడిచి ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ హక్కులను హరించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని అన్నారు. దేశంలోని పేదలు, అణగారిన ప్రజలందరి హక్కల కోసం తాను ‘‘చౌకీదార్’’ అని పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ హక్కుల్ని లాక్కుని, తన ఓటు బ్యాంకుకు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తోంది, గిరిజన ఆడబిడ్డ అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని వెన్నుపోటు పొడిచే అధికారం ఎవరికీ లేదు, మీ ప్రధాన మంత్రి దళితులు, వెనకబడినవారి హక్కులను హరించడానికి అనుమతించరని అన్నారు. ఈసారి కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ వయసు కన్నా తక్కువ స్థానాలు పొందుతుందని ప్రధాని అన్నారు.

Exit mobile version