Site icon NTV Telugu

IndiGo Flights: ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం.. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు

Indigo Flights

Indigo Flights

బాబోయ్.. ఇండిగో విమాన ప్రయాణికుల కష్టాలు అన్నీఇన్నీ కావు. రెండు, మూడు రోజులుగా విమాన సర్వీసులు లేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ఇటు ఇంటికి వెళ్లలేక.. అటు ప్రయాణం లేక విమానాశ్రయాల్లోనే పడిగాపులు పడుతున్నారు. ఏ క్షణంలోనైనా సర్వీసులు పునరుద్ధరణ కాకుండా పోతాయా? అంటూ ఎదురుచూస్తున్నారు. ఇక పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. తిండి తిప్పలు లేక అక్కడ్నే సేదతీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మూడు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. మొదట కొన్ని సర్వీసులు రద్దు కాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 500కు చేరింది. మొత్తం 500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఎమర్జెనీ ప్రయాణం ఉన్నవారికి పీడకలగా మారింది. ఎయిర్‌పోర్టులకు వచ్చాక.. సర్వీసులు లేవని చెప్పడంతో ప్యాసింజర్స్ షాక్‌కు గురవుతున్నారు. పెద్ద ఎత్తున క్యూలు ఉన్నాయి. ఎక్కడ చూసినా సూట్‌కేసులు, వాటర్ బాటిళ్లు పడి ఉన్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. చాలా మంది నేలపైనే పడుకున్నారు. మరికొందరు కోపంగా ఆందోళనకు దిగారు. ఇంకొందరు విమాన సంస్థ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.

12 గంటలు అవుతున్నా ఎయిర్‌లైన్స్ ఎటువంటి సమాచారం రాలేదని ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో వాపోయాడు. ప్రతిసారీ ఒక గంట ఆలస్యం.. రెండు గంటలు ఆలస్యం అని చెబుతున్నారని.. పెళ్లికి వెళ్లడానికి వచ్చి ఇరుక్కుపోయామంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ దుమ్మెత్తిపోస్తు్న్నారు. ఇలా ప్రతి ప్రయాణికుడు మండిపడుతున్నారు.

Exit mobile version