Off The Record: పవర్‌లో ఉన్న పార్టీ. అందునా… ఎన్నికల్లో హండ్రెస్ పర్సంట్ స్ట్రైక్ రేట్‌తో దుమ్ము రేపిన పార్టీ. ఇంకేముంది అక్కడ అడుగుపెడితే చాలు… ఎక్కడికో వెళ్లిపోతాం. అందులోనూ మనకున్న అనుభవం ఏంటి… వెనకున్న బలం బలగం ఏంటి…? వాటన్నిటినీ చూసి ఎక్కడిక్కడ స్పెషల్ ఛైర్స్ వేసి కూర్చోబెడతారంటూ తెగ కలలుగన్నారట వైసీపీ నుంచి జనసేనలోకి మారిన నలుగురు సీనియర్స్. ఇప్పుడేమో…. స్పెషల్ సంగతి తర్వాత కనీసం ముందు వరుసలో ప్లాస్టిక్ కుర్చీకే దిక్కులేక తలలు పట్టుకుంటున్నారన్నది వాళ్ళ అనుచరుల వాయిస్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నుంచి టీడీపీ, జనసేనల్లోకి చాలామంది నాయకులు జంప్ అయ్యారు. అలా… జనసేనలో చేరిపోయారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను. ఈ నలుగురూ సీనియర్సే కావడంతో… జనసేనలో అయితే సరైన ప్రాధాన్యం ఉంటుందని, పొజిషన్‌కు ఢోకా ఉండబోదని రకరకాల లెక్కలేసుకున్నారు. కానీ… ఆ లెక్కలన్నీ తప్పాయంటూ ఇప్పుడు తీరిగ్గా ఫీలవుతున్నట్టు సమాచారం.
జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని, జిల్లాల్లో కూడా అసలు ఉన్నామా లేదా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయని ఫీలవుతున్నారట నలుగురూ. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గట్టి ప్రభావం చూపగలిగిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ముందు నుంచే జగన్‌తో విభేదాలున్నా… గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనలో చేరారాయన. అనుభవం, కుల సమీకరణల దృష్ట్యా ఆయన సేవల్ని రాష్ట్ర స్థాయిలో వాడుకుంటారని తొలుత ప్రచారం జరిగినా… తీరాచూస్తే ఇప్పుడు సొంత నియోజకవర్గం ఒంగోలులోనే ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇతర కీలక సమావేశాల్లో ఎక్కడ చూసినా బాలినేని వెనక వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఆ మధ్య విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంవో కూడా ప్రాధాన్యం లేకపోవడంపై బాలినేని అనుచరులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. పదవి సంగతి తర్వాత… సీనియర్ లీడర్‌గా కనీస గౌరవం కూడా దక్కడం లేదని బాలినేని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. పొరపాటు చేశానా? తప్పు నిర్ణయం తీసుకున్నానా..అంటూ సొంత మనుషుల దగ్గర అంటున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు పార్టీ మారిన నాయకులు కూడా అవే ప్రశ్నలు లేవనెత్తుతున్నారట. మరోనేత సామినేని ఉదయభాను పరిస్థితి కూడా అలాగే ఉందంటున్నారు. జనసేనలో చేరాక ఆయనకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. దానితో ఆయన సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. జిల్లాలో జనసేనకు బలమైన కేడర్ లేకపోవడం, నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నాయకత్వం దొరక్కపోవడం లాంటి కారణాలతో… పార్టీని నడపడం కష్టంగా ఉందని అనుకుంటున్నారట ఉదయభాను. దానికి తోడు వివిధ అంశాలను చర్చించేందుకు పవన్‌ను కలిసే అవకాశం కూడా పెద్దగా రాకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి ఉన్నా లేకున్నా ఒక్కటేనని అనుకుంటున్నారాయన.
పవన్ మీద నమ్మకంతో పార్టీలోకి వచ్చాంగానీ… పరిస్థితులు మాత్రం అలా లేవని అంటోంది సామినేని వర్గం. ఈ లిస్ట్‌లో ఉన్న ఇంకో నేత పెండెం దొరబాబు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన దొరబాబు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉందట. పిఠాపురంలో సమన్వయం కోసం నియమించిన ఫైవ్‌మెన్ కమిటీలో స్థానం మినహా…. రాజకీయంగా ఏ ప్రాధాన్యం దక్కలేదన్న బాధ ఆయన్ని వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే టికెట్ ఇస్తామనే భరోసాతో ఉన్నా… గ్రౌండ్‌లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదన్నది దొరబాబు అసహనం. ఈ లిస్ట్‌లోని నాలుగవ నేత కిలారు రోశయ్య. ఈ నలుగురిలో అత్యంత క్లిష్ట పరిస్థితి రోశయ్యదేనని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికీ పొన్నూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్‌గా మార్కండేయ బాబు కొనసాగుతుండడంతో రోశయ్యను పూర్తిగా పక్కకు నెట్టినట్టేనని అంటున్నారు. అసలు ఏ పవీ లేక, కనీస గుర్తింపు దక్కక మిగతా వాళ్ళకంటే ఘోరంగా నా పరిస్థితి ఉందనుకుంటుూ ఆయన సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడసలు పొన్నూరులో కిలారు ఉన్నారో లేరో కూడా తెలియని పరిస్థితి. ఆ రకంగా తీవ్ర గందరగోళంలో ఉన్న ఈ నలుగురు తిరిగి వైసీపీలోకి వెళదామంటే… ఆత్మగౌరవ సమస్యలు వస్తాయేమోనని భయపడుతున్నారట. అలా ఎటూ కాకుండా… ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామా అన్నది ఈ నలుగురు సీనియర్స్ ఫీలింగ్ తెలుస్తోంది. సరే… జరిగిందేదో జరిగిపోయింది…. ఎన్నికల సమయానికైనా మళ్లీ యాక్టివ్ అవుదామనుకుంటూ వాళ్ళలో వాళ్ళే బాధను దిగమింగుకుంటున్నారట. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ అయినా… వైసీపీ నుంచి బయటికొచ్చి జనసేనలో కొత్త భవిష్యత్ కోరుకున్న ఈ నలుగురు త్రిశంకు స్వర్గంలో ఉన్నారన్నది పొలిటికల్ టాక్.