Site icon NTV Telugu

IndiGo: బీహార్ వెళ్లాల్సిన వ్యక్తిని రాజస్థాన్‌లో దించిన విమానం.. ఘటనపై డీజీసీఏ విచారణ

Indigo

Indigo

IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది.

ఇదిలా ఉంటే మరో సంఘటన జరిగింది. బీహార్ లోని పాట్నాకు వెళ్లాల్సిన వ్యక్తిని, రాజస్థాన్ ఉదయ్ పూర్ లో దించింది ఇండిగో విమానం. ఎయిర్ పోర్టులో పలు దశల్లో ప్రయాణికుడి బోర్డింగ్ పాస్ చెక్ చేస్తుంటారు.. అయినా కూడా వేరే విమానంలో గమ్యస్థానానికి 1400 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే ప్రాంతంలో దిగాల్సి వచ్చింది. ఈ సంఘటన జనవరి 30న జరిగింది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. తరువాతి రోజు సదరు ప్రయాణికుడిని గమ్యస్థానానికి పంపారు.

Read Also: Free Cancer Screening: మల్లారెడ్డి క్యాన్సర్ హస్పిటల్‌లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్..

అఫ్సర్ హుస్సేన్ అనే ప్రయాణికుడు ఇండిగో ఫ్లైట్ 6ఈ-214 ద్వారా పాట్నాకు టిక్కెట్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే షెడ్యూల్ చేసిన టైమ్ కు విమానం ఎక్కడానికి జనవరి 30న ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అతను పొరబాటున ఇండిగోకు చెందిన మరో విమానం 6ఈ-319 విమానం ఎక్కాడు. ఇది ఢిల్లీ నుంచి రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ వెళ్తోంది. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత అఫ్సర్ కు అసలు విషయం అర్థం అయింది. ఈ ఘటనపై అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఇండిగో అతడిని అదే రోజు ఢిల్లీకి, ఈ తరువాత జనవరి 31న పాట్నాకు తీసుకెళ్లింది.

ఈ ఘటనపై సదరు విమానయాన సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని.. డీజీసీఏ అధికారులు తెలిపారు. ప్రయాణీకుల బోర్డింగ్ పాస్‌ను ఎందుకు పూర్తిగా స్కాన్ చేయలేదని, నిబంధనల ప్రకారం బోర్డింగ్ పాస్‌లను బోర్డింగ్‌కు ముందు రెండు పాయింట్ల వద్ద తనిఖీ చేసినప్పటీకీ.. అతను తప్పుగా ఎలా ఎక్కాడు అనే విషయాలను డీజీసీఏ విచారిస్తోంది. గత 20 రోజుల్లో ఇండిగో విమానంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. దీనిపై ఇండిగో స్పందించింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎయిర్ లైన్స్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు జనవరి 13న, ఇండోర్ వెళ్లే విమానానికి ఎయిర్‌లైన్స్ టిక్కెట్, బోర్డింగ్ పాస్ కలిగి ఉన్న ఒక ప్రయాణికుడు తప్పు విమానంలో ఎక్కి నాగ్‌పూర్ విమానాశ్రయంలో దించింది.

Exit mobile version