IndiGo Airbus A321 Hits Runway Before Landing in Bengaluru: బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెను విమాన ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ A321 విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ‘టెయిల్ స్ట్రైక్’ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనుక భాగం రన్‌వేను తాకడంతో పైలట్లు వెంటనే ల్యాండింగ్‌ను నిలిపివేసి గో-అరౌండ్ చేపట్టారు. అనంతరం రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
వివరాల ప్రకారం, ఇండిగో 6E 6542 విమానం బెంగళూరు విమానాశ్రయంలోని రన్‌వేకు అత్యంత సమీపంలో ఉన్న సమయంలో బలమైన గాలులు వీచాయి. దీంతో పైలట్లు ల్యాండింగ్‌ను రద్దు చేసి విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. విమానయాన పరిభాషలో దీనిని ‘గో-అరౌండ్’ అంటారు. ఈ ప్రక్రియలోనే విమానం వెనుక భాగం రన్‌వేను తాకినట్లు సమాచారం. అయితే పైలట్లు విమానంపై నియంత్రణ కొనసాగించి, దాన్ని తిరిగి పైకి తీసుకెళ్లారు. కొంతసేపు చుట్టూ తిరిగిన అనంతరం రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై దించారు.
ప్రయాణికులు, సిబ్బంది సురక్షితం
ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో ప్రతినిధి తెలిపారు. ల్యాండింగ్ సమయంలో బలమైన గాలుల కారణంగా అసాధారణ రన్‌వే కాంటాక్ట్ జరిగినట్లు ఎయిర్‌లైన్ వెల్లడించింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు, సిబ్బంది సాధారణ ప్రక్రియలో విమానం నుంచి దిగారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత విమానయాన నియంత్రణ సంస్థలకు వెంటనే అందించినట్లు ఇండిగో తెలిపింది.
DGCA దర్యాప్తు
ఘటనను పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించింది. ఘటన అనంతరం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల (SOP) ప్రకారం విమానాన్ని తాత్కాలికంగా సేవల నుంచి తప్పించి సాంకేతిక తనిఖీలకు పంపించారు. ఇండిగో ఇంజినీర్లు విమానం నిర్వహణ, సాంకేతిక పరిస్థితి తదితర అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. అవసరమైన సాంకేతిక అనుమతులు లభించిన తర్వాతే విమానాన్ని తిరిగి సేవల్లోకి తీసుకురానున్నారు.
టెయిల్ స్ట్రైక్‌లపై దృష్టి
ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న టెయిల్ స్ట్రైక్ ఘటనల నేపథ్యంలో DGCA, ఇండిగోతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులను పైలట్లు మరింత సమర్థంగా ఎదుర్కొనేలా శిక్షణను మరింత కఠినతరం చేయనున్నట్లు ఎయిర్‌లైన్ తెలిపింది. పైలట్లు సకాలంలో గో-అరౌండ్ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం విమానాన్ని సాంకేతికంగా పూర్తిగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

