JEE Mains: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈనెల 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు విడతల్లో అధికారులు నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. అరగంట ముందు ప్రవేశ గేటును మూసివేస్తారు. అంటే అరగంట ముందే పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా పరీక్ష సమయం పూర్తయ్యేవరకు అభ్యర్థులెవ్వరినీ బయటకు పంపే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు.
Read Also: HCU: హెచ్‌సీయూలో మోదీ డాక్యుమెంటరీ కలకలం.. అధికారులు విచారణ
పరీక్షలకు హాజరయ్యేవారు ఒరిజినల్ గుర్తింపుకార్డు, హాజరు షీట్‌పై అతికించేందుకు పాస్‌పోర్టు సైజ్ ఫోటోను పరీక్షా కేంద్రంలోకి తీసుకువెళ్లాలి. మాస్కులను పరీక్షా కేంద్రాల్లోనే ఇస్తారు. ఇంటి నుంచి తీసుకెళ్లే మాస్కులను అనుమతించమంటూ అధికారులు తెలిపారు. పరీక్షలు రాసేందుకు దేశవ్యాప్తంగా 8,66, 411 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ పరీక్షలకు ఎక్కువ మంది హాజరయ్యే మొదటి ఐదు రాష్ట్రాలలో ఏపీ మూడో స్థానంలో, తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. విజయవాడలో 15వేల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షలను రాయనున్నారు. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 1,03,039 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 99,714 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 91,799 మంది, తెలంగాణ నుంచి 86,840 మంది, రాజస్థాన్ నుంచి 59, 641 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలను రాయనున్నారు.