NTV Telugu Site icon

Canada: కెనడా చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.. ట్రూడో తీరుపై భారత్ ఆగ్రహం..

Canada

Canada

Canada: భారత వ్యతిరేక, ఖలిస్తానీ మద్దతుదారులపై కెనడా మెతక వైఖరి అవలంభిస్తోంది. పలుమార్లు ఈ విషయాన్ని భారత్, కెనడా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పలు సందర్భాల్లో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పాటు ప్రధాని నరేంద్రమోడీని బెదిరిస్తూ పోస్టర్ల అంటించడంతో పాటు కెనడాలోని పలు ప్రాంతాల్లో ఖలిస్తాన్ రెఫరెండం నిర్వహించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎలాంటి భయం లేకుండా కెనడాలో భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

ఇదిలా ఉంటే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో‌పై ఇటీవల ఆన్లైన్‌లో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల్ని అక్కడి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది. అయితే, దీనిని కెనడా ‘‘ద్వంద్వ ప్రమాణాలు’’అని భారత్ ఆరోపించింది. గురువారం మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. భారతీయ నాయకులు, దౌత్యవేత్తలను పదేపదే బెదిరించే భారత వ్యతిరేక శక్తులపై కెనడా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో అలసత్వం వహిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.

Read Also: Health Tips: సకాలంలో గర్భం దాల్చలేకపోతే ఈ వ్యాధులు చెక్ చేసుకోండి

“ప్రజాస్వామ్యం చట్టం యొక్క పాలన మరియు భావప్రకటనా స్వేచ్ఛను కొలవడానికి లేదా అమలు చేయడానికి వివిధ ప్రమాణాలను అవలంబించినప్పుడు, అది దాని స్వంత ద్వంద్వ ప్రమాణాన్ని మాత్రమే బహిర్గతం చేస్తుంది” అని జైశ్వాల్ అన్నారు. ఇటీవల ట్రూడోని బెదిరించిన వారిని అరెస్ట్ చేసిన విధంగానే, భారతీయ నాయకులను బెదిరిస్తున్న వారిపై అలాంటి చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

ఇటీవల ట్రూడో, ఇతర కెనడియన్ రాజకీయ నాయకులపై అల్బెర్టాకి చెందిన ఇద్దరు ఆన్‌లైన్‌లో బెదిరించారు. వీరిద్దరిని అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. జూన్ 6న ఎక్స్‌లో ట్రూడోని చంపుతామని బెదిరించారు. ట్రూడోతో పాటు ఉప ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్, న్యూడెమోక్రటిక్ పార్టీ నేత, ఎంపీ జగ్మీత్ సింగ్‌లకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ గతేడాది సర్రేలో హత్యకు గురైనప్పటి నుంచి కెనడా-భారత్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. నిజ్జర్ హత్య వెనక భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని ట్రూడో వ్యాఖ్యానించడంతో భారత్ తీవ్రంగా స్పందించింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారుతోందని, కెనడా చేసిన వ్యాఖ్యలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలను విమర్శించింది.