Droupadi Murmu: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో కూడా భారత్ శాంతి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తూనే ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మానవజాతి సురక్షితంగా ఉండాలంటే ప్రపంచమంతా శాంతి నెలకొనాలని, అదే భారత్ అనుసరిస్తున్న నాగరికతా విలువ అని ఆమె అన్నారు. దేశభద్రత విషయంలో భారత్ రాజీ పడేది లేదని ఆమె స్పష్టం చేశారు. గతేడాది, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాక్‌పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు.
Read Also: Rare earth elements: భారత్‌కు భారీ జాక్‌పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..
గతేదాది సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాద కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు జరిగాయి. అనేక ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని ఆమె చెప్పారు. ఇది భారత రక్షణ రంగంలో పెరుగుతున్న ఆత్మనిర్భరతకు నిదర్శనమని ఆమె అన్నాను. భారత సైన్యంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. మహిళా శక్తి దేశ అభివృద్ధి ప్రయాణానికి కేంద్ర బిందువని రాష్ట్రపతి చెప్పారు. 10 కోట్లకు పైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో పాల్గొంటున్నారని, పంచాయతీ రాజ్ వ్యవస్థల్లో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 46 శాతం ఉందని, నారి శక్తి వందన్ అధినయం మహిళల రాజకీయ సాధికారతను పెంచుతుందని ఆమె చెప్పారు. క్రీడలు, అంతరిక్షం, రక్షణ, వ్యాపార రంగాల్లో భారత మహిళలు రాణిస్తున్నారని అననారు.
ఇటీవల సంవత్సరాల్లో లక్షలాది మంది పేదరికం నుంచి బయట పడ్డారని, వారు మళ్లీ పేదరికంలోకి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, 81 కోట్ల మందికి కేంద్రం సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతున్నాయని అన్నారు. ప్రపంచ డిజిటల్ లావాదేవీల్లో సగానికి పైగా ఇప్పుడు భారత్‌లోనే జరుగుతున్నాయని ఆమె తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారే దిశగా దేశం ప్రయాణిస్తోందని అన్నారు. స్వాతంత్య్రం తర్వాత జీఎస్టీని అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా రాష్ట్రపతి అభివర్ణించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చిన గీతమని కొనియాడారు.
