Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునేందుకు రంగం సిద్దమైంది. ఈ నెల 10న ఆయన పదవీస్వీకారం చేయబోతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో కమలా హారిస్‌పై ట్రంప్ ఘన విజయం సాధించారు. మరోసారి ఆయన అగ్రరాజ్యానికి అధినేత కాబోతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్(ECFR) నిర్వహించిన గ్లోబల్ పోల్‌లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే డొనాల్డ్ ట్రంప్‌కి భారతీయులే అతిపెద్ద మద్దతుదారులుగా ఉన్నట్లు తేలింది.
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి రావడం ప్రపంచ శాంతికి మేలు చేస్తుందని, అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేస్తుందని మెజారిటీ భారతీయులు విశ్వసిస్తున్నారు. భారత్, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాలలో ట్రంప్ నాయకత్వం పట్ల ప్రజలు ఆశావాదంతో ఉన్నట్లు తేలింది. అయితే, అదే సమయంలో ట్రంప్‌పై అనేక యూరోపియన్ దేశాలు ఇందుకు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి.
జనవరి 20న జరగనున్న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారానికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బుధవారం వీడ్కోలు ప్రసంగం చేశారు. “అలోన్ ఇన్ ఎ ట్రంపియన్ వరల్డ్: ది EU అండ్ గ్లోబల్ పబ్లిక్ ఒపీనియన్ ఆఫ్టర్ ది యుఎస్ ఎలక్షన్స్” అనే శీర్షికతో ECFR నివేదికను వెల్లడించింది. 82 శాతం భారతీయులు ట్రంప్ తిరిగి ఎన్నికవ్వడం ప్రపంచ శాంతికి సానుకూల అడుగుగా భావిస్తున్నారు. 84 శాతం మంది దీనిని భారత్‌కి ప్రయోజనంగా భావిస్తున్నారు. 85 శాతం మంది అమెరికన్ పౌరులకు మంచిదని చెబుతున్నారు.
Read Also: Central Cabinet Decisions: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక
ట్రంప్ వెల్కమర్స్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా భారతీయులే ముందంజలో ఉన్నారు. ట్రంప్ మళ్లీ గెలవడంపై వారి అవగాహన ఆధారంగా 24 దేశాల్లో నిర్వహించిన పోల్‌లో దేశాలను 5 వర్గాలుగా విభజించారు. మొదటి వారు ‘‘ట్రంప్‌ని స్వాగతించేవారు’’ వీరు ట్రంప్ విజయం అమెరికన్లకు, ప్రపంచ శాంతికి మంచిదని భావిస్తున్నారు. ఈ వైఖరి ఎక్కువగా భారత్, సౌదీ అరేబియాలో ఉంది. రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, బ్రెజిల్‌లు కూడా ఇదే వైఖరిని కలిగి ఉన్నాయి. భారత్ ‘‘ట్రంప్ వెల్కకమర్స్’’లోకి వస్తుంది. భారత్, చైనా, టర్కీ, బ్రెజిల్ దేశాలలో ట్రంప్ తమకు చెడు చేస్తాని అనుకునే దాని కంటే అమెరికాకు, తమ దేశానికి, ప్రపంచ శాంతికి మంచివాడని ఎక్కువ మంది భావిస్తున్నారని నివేదిక వెల్లడించింది.
దీనికి విరుద్ధంగా యూరోపియన్ దేశాలు ఉన్నాయి. ట్రంప్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాయి. ఉదాహరణకు యూకేలో ‘‘నెవర్ ట్రంపర్స్’’ వైఖరిని కలిగి ఉన్నారు. వీరంతా ప్రపంచ శాంతికి, అమెరికన్ల ప్రయోజనాలకు హనికరమని భావిస్తున్నారు. బ్రిటన్‌లో సంగ మంది ఈ వర్గంలోకి వస్తున్నారు. దక్షిణ కొరియా, టర్కీ, బ్రెజిల్ దేశాల్లో కూడా కొంత మందిలో ఈ వైఖరి ఉంది. ట్రంప్ అధికారంలోకి రావడం యూరప్ ఒంటరి అవుతుందని ఆందోళన చెందుతున్నారు.
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ నిర్మించడంలో యూరప్ నాయకులు ఇబ్బంది పడొచ్చని నివేదిక వెల్లడించారు. బదులుగా, యూరప్ తన సొంత ప్రయోజనాలను నిర్వచించుకోవడం మరియు భారతదేశం, బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా వంటి దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని వారు సిఫార్సు చేస్తున్నారు. ట్రంప్‌కి వ్యతిరేకంగా ప్రవర్తించే బదులు, యూరప్ దేశాలు సొంత ప్రయోజనాలను పట్టించుకోవాలని, ఇతర దేశాలతో సంబంధాలనను బలపరుచుకోవాలని ECFR సహ వ్యవస్థాపకుడు మరియు డైరెక్టర్ మార్క్ లియోనార్డ్ అన్నారు. ఈ పోల్‌లో, 11 ఈయూ సభ్యదేశాలతో పాటు భారత్, చైనా, టర్కీ, యూఎస్ ప్రపంచ వ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తాయని సర్వేలో ప్రజలు చెప్పారు.