Indian Economy: అమెరికా, జపాన్, పలు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉండగా.. కేవలం ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక వ్యవస్థ మాత్రమే ఆశాజనకంగా ఉంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు భారత వృద్ధి రేటు 8 శాతం ఉంటుందని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) సీనియర్ అధికారి భారత ఆర్థిక వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 వరకు తిరుగు ఉండదని చెప్పారు.
గత 10 ఏళ్లుగా దేశం అమలు చేసిన మంచి విధానాలను రెట్టింపు చేసి, సంస్కరణలను వేగవంతం చేయగలిగితే, 2047 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్ ఈ రోజు అన్నారు. 8 శాతం వృద్ధి రేటు అనేది చాలా ప్రతిష్టాత్మకమైనదని, ఎందుకంటే భారత్ ఇంతకుముందు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందలేదు, కానీ సాధించగలిగిందని చెప్పారు. ‘‘మా ఆలోచన ఏంటంటే, గత 10 ఏళ్లలో భారత్ నమోదు చేసుకున్న వృద్ధి రకంతో, గత 10 ఏళ్ల పాటు అమలు చేసిన విధానాలను రెట్టింపు చేయగలిగితే, ఆర్థిక సంస్కరణలు వేగవంతం చేయగలిగితే అప్పుడు 2047 వరకు భారత్ 8 శాతం వద్ద వృద్ధి చెందుతుంది.’’ అని టైమ్స్ నౌ సమ్మిట్‌లో అన్నారు.
2023 చివరి మూడు నెలల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఊహించిన దాని కంటే మెరుగైన 8.4 శాతం వృద్ధిని సాధించింది, గత ఒకటిన్నర సంవత్సరాల్లో అత్యంత వేగాన్ని నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్‌లో వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలను 7.6 శాతానికి తీసుకెళ్లింది. భారత్ 2047 వరకు 8 శాతం వృద్ధి సాధిస్తే 55 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని సుబ్రమణియన్ అన్నారు. 1991 నుంచి భారత సగటు వృద్ధి 7 శాతం కంటే కొంచెం ఎక్కువగా ఉందని ఆయన హైలెట్ చేశారు. ఎక్కువ ఉద్యోగాలను సృష్టించగలిగితే మాకు అవకాశం ఉందని, అది చాలా ఎక్కువ వినియోగానికి దారితీస్తుందని అన్నారు. ఉద్యోగ కల్పనలో మాన్యుఫాక్చర్ రంగాన్ని ప్రోత్సహించాల్సి అవసరాన్ని నొక్కి చెప్పారు. లాండ్, లేబర్, మూలధనం, లాజిస్టిక్ రంగంలో సంస్కరణలు అవసరమని ఆయన చెప్పారు. తయారీ రంగంలో సంస్కరణలు అవసరమని, అదే సమయంలో తయారీ రంగానికి క్రెడిట్ అందించడానికి బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు కూడా అవసరమని సుబ్రమణియన్ పేర్కొన్నారు.