Terrorists Attack: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ ప్రాంతంలో సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఐదుగురు ఎయిర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలయ్యాయి. గత ఏడాది సైన్యంపై వరసగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది సైన్యంపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే. ఈ దాడిలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. దాడి జరిగిన ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయపడిన సైనికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది.
‘‘ జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాహనాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. స్థానిక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. షాసితార్ సమీపంలోని ఎయిర్ బేస్ లోపల వాహనాలు భద్రపరచబడ్డాయి. సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి’’ అని భద్రతా దళాలు వెల్లడించాయి.