India US Trade Dispute 2025: భారతదేశానికి చెందిన అల్యూమినియం, ఉక్కు, సంబంధిత ఉత్పత్తులపై అమెరికా టారీఫ్స్ విధించింది. దీనిపై ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందం కింద చర్చలకు రావాలంటూ భారత్ చేసిన అభ్యర్థనకు అగ్రరాజ్యం ఒప్పుకోవడం లేదని లోక్సభలో కేంద్ర వాణిజ్యం- పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని వాటిని విధించినట్లు యూఎస్ వాదించిందని లిఖితపూర్వక సమాధానంలో ఆయన తెలియజేశారు. అయితే, దిగుమతి సుంకాల విషయంలో డబ్ల్యూటీవో అగ్రిమెంట్స్ ఆన్ సేఫ్గార్డ్స్ నిబంధనలను న్యూయార్క్ పాటించకపోవడంతో.. భారత్ సైతం అదే స్థాయిలో చర్యలు తీసుకునే హక్కును కలిగి ఉందని తెలియజేశారు. స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాల విధింపును రక్షణాత్మక చర్యలుగా ఇండియా భావిస్తుంది. డబ్ల్యూటీవో అగ్రిమెంట్స్ ఆన్ సేఫ్గార్డ్స్ కింద సంప్రదింపులకు లోబడి ఉండాల్సిన అంశంగా దీన్ని పరిగణిస్తున్నామని జితిన్ ప్రసాద చెప్పుకొచ్చారు.
Read Also: PVN Madhav: రాజధాని అమరావతిపై బీజేపీ ఏపీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న చర్చల్లో భారత్ చురుకుగా పాల్గొంటోందని మంత్రి మరో ఆన్సర్ లో తెలియజేశారు. రైతులు, దేశీయ పరిశ్రమల ప్రయోజనాలను కాపాడటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఈ ఏడాది మార్చి నుంచి చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదు రౌండ్ల చర్చలు జరిగినట్లు సమాచారం.