Retail Inflation: ఉల్లి-వెల్లుల్లి ధరల మంట.. 4.45%కి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం

  • జూలైలో 4.45 శాతానికి పెరిగిన భారత రిటైల్ ద్రవ్యోల్బణం..
  • ఆర్‌బీఐ 4 శాతం లక్ష్యాన్ని అధిగమించిన గణాంకాలు..
  • ఉల్లి, వెల్లుల్లి, అల్లం ధరల పెరుగుదలతో పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం
Retail Inflation

Retail Inflation

Retail Inflation:  భారతదేశంలో రిటైల్ ద్రవ్యల్బణం జూలై నెలలో తీవ్రంగా పెరిగింది. బుధవారం విడుదల చేసిన ప్రభుత్వం గణాంకాల ప్రకారం.. పెరిగిన ఆహార, నిత్యావసర ధరల కారణంగా వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ లోని 4.38% నుండి జూలై 2026 నాటికి 4.45%కి పెరిగింది. ఇది ఆర్బీఐ అంచనా 4 శాతం మధ్యకాలిక లక్ష్యాన్ని అధిగమించింది. నెలవారీ ప్రాతిపదికన సాధారణ CPI సూచీ 0.9 శాతం పెరగగా, ఆహార ధరల సూచీ 2.1 శాతం పెరిగింది.

గ్రామీణ ప్రాంతాల్లో జూన్ నెలలో ద్రవ్యోల్బణం 4.74%గా ఉంటే, అది జూలై నెలకు 4.84%కి పెరిగింది. ఇదే సమయంలో పట్టణ ద్రవ్యోల్బణం 3.93% నుండి 3.96%కి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్‌లోని 5.32 శాతం నుంచి జూలైలో 5.52 శాతానికి పెరిగింది. ఆహారం, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం కూడా 5.05 శాతం నుంచి 5.24 శాతానికి చేరింది.

ఉల్లి ద్రవ్యోల్బణం 4.73% నుండి 22.54%కి పెరిగింది. వెల్లుల్లి ద్రవ్యోల్బణం 17.93% నుండి 35.36%కి పెరగగా, అల్లం ద్రవ్యోల్బణం 50.41% నుండి 83.62%కి పెరిగింది. అయితే, అన్ని కూరగాయల ధరలు పెరగలేదు. బంగాళాదుంప ధరలు ఏడాది ప్రాతిపదికన 16.56% తగ్గగా, బెండకాయల ధరలు 5.52% తగ్గాయి. బఠానీ, టమాటా ధరలు కూడా వరుసగా 5.27%, 4.59% తగ్గాయి.

రవాణా విభాగంలో ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.31% నుండి జూలైలో 4.43%కి పెరిగింది, అయితే సరుకుల రవాణా సేవల ద్రవ్యోల్బణం 7.70% నుండి 7.77%కి స్వల్పంగా పెరిగింది. గృహ ద్రవ్యోల్బణం 2.22% గా నమోదంది, ఇందులో గ్రామీణ గృహ ద్రవ్యోల్బణం 2.80% , పట్టణ గృహ ద్రవ్యోల్బణం 2.01%గా ఉంది. రెస్టారెంట్లు, వసతి సేవల్లో ద్రవ్యోల్బణం 7.72%గా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ధరలు 3.38 %కి పెరిగాయి. వ్యక్తిగత సంరక్షణ, ఇతర వస్తువులు, సేవల విభాగంలో ద్రవ్యోల్బణం 14.77% శాతం వద్ద నమోదవడం గమనార్హం.

ఆరోగ్య సేవల ద్రవ్యోల్బణం 1.34% వద్ద స్థిరంగా ఉండగా, విద్యా సేవల ద్రవ్యోల్బణం 3.64%కి పెరిగింది. మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.1%, రెండవ త్రైమాసికంలో 4.7%, మూడవ త్రైమాసికంలో 5.9%, నాల్గవ త్రైమాసికంలో 5.5% ఉంటుందని ఆర్‌బిఐ అంచనా వేస్తోంది. ప్రధాన ద్రవ్యోల్బణం మూడవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుతుందని ఇది భావిస్తోంది.