Site icon NTV Telugu

POK: పీఓకేలో పర్యటించిన బ్రిటిష్ రాయబారి.. భారత్ తీవ్ర అభ్యంతరం..

India Protests Pok Visit By British Envoy

India Protests Pok Visit By British Envoy

POK: పాకిస్తాన్‌లో బ్రిటన్ రాయబారిగా ఉన్న జేన్ మారియట్ ఇటీవల పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే)లో పర్యటించడం వివాదాస్పదమైంది. పాకిస్థాన్‌లోని UK హైకమిషనర్ జేన్ మారియట్ జనవరి 10న మీర్పూర్‌ను సందర్శించారు. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమె పర్యటన ‘‘అత్యంత అభ్యంతరకరం.. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు భంగ కలిగించే చర్య’’ అంటూ భారత విదేశాంగ శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ ఉల్లంఘనపై విదేశాంగా కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషన్‌కి తీవ్ర నిరసన తెలిపినట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగం ఉన్నాయి, ఎప్పుడూ ఉంటాయని ప్రకటనలో పేర్కొంది.

Read Also: Stray Dogs Attack: వీధి కుక్కల దాడిలో 7 నెలల బాలుడి మృతి..

ఇటీవల పీఓకేని సందర్శించిన పాక్ లోని బ్రిటిష్ రాయబారి జేన్ మారియట్ ఎక్స్(ట్విట్టర్)లో ఆ ఫోటోలను షేర్ చేశారు. బ్రిటీష్ పాకిస్తానీ మూలాల్లో 70 శాతం మీర్పూర్ నుంచి వచ్చినట్లు తెలిపారు. ‘‘ మీర్పూర్ నుంచి సలామ్, యూకే-పాకిస్తాన్ ప్రజల మధ్య ఉన్న బంధం.. 70 శాతం బ్రిటిష్ పాకిస్తానీ మూలాలు మీర్పూర్ నుంచి వచ్చాయి. ప్రవాసుల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడం చాలా కీలకం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలు సిగ్గు చేటని భారత నెటిజన్లు మండిపడుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని యూకే ప్రధాని రిషి సునాక్‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు ముందు అక్టోబర్ 2023లో పాకిస్తాన్ లోని అమెరికా రాయబారి డేవిడ్ బ్లోమ్ కూడా ఇలాగే పీఓకేలోని గిల్గిట్-బాల్టి్స్తాన్ సందర్శించడం వివాదాస్పదమైంది. పీఓకే భారత్‌లో అంతర్భాగమని మన దేశం చెప్పింది.

Exit mobile version