India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India New Visa Rules 2026: భారత్‌కు వచ్చే విదేశీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో వీసా విధానాన్ని మరింత సరళీకృతం చేస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) కీలక మార్పులు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రధాన వీసా కేటగిరీల సంఖ్యను 13 నుంచి 9కి, సబ్ కేటగిరీలను 49 నుంచి 23కి తగ్గించింది. అంతేకాకుండా వీసా దరఖాస్తు ఫారాల్లోని వివరాలు, కాలమ్‌ల సంఖ్యను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది. దీంతో విదేశీయులు భారత్‌కు రావడానికి అవసరమైన వీసా ప్రక్రియ మరింత సులభం కానుంది. ప్రయాణికులకు అనవసరమైన పత్రాల భారం తగ్గించడం, దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయడం, విదేశీ పర్యాటకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, వైద్య చికిత్స కోసం వచ్చే వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది.
13 నుంచి 9కి తగ్గిన వీసా కేటగిరీలు
భారత ప్రభుత్వం గతంలో కూడా వీసా విధానంలో మార్పులు చేపట్టింది. 2025 అక్టోబర్‌లో ప్రధాన వీసా కేటగిరీలను 22 నుంచి 13కి, సబ్ కేటగిరీలను 63 నుంచి 49కి తగ్గించింది. తాజాగా ఆగస్టు 27న మరోసారి సమీక్షించి కొత్త మార్పులు తీసుకొచ్చింది. అభివృద్ధి చెందిన దేశాల వీసా విధానాలు, అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ తెలిపింది. ఒకే తరహా ప్రయాణ అవసరాలకు సంబంధించిన వీసాలను ఒకే విభాగంలోకి తీసుకురావడం ద్వారా దరఖాస్తుదారులు తమకు అవసరమైన వీసాను సులభంగా ఎంచుకోవచ్చు.
Also Read
- CM Vijay: ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ సీరియస్ వార్నింగ్.. నేడు మరోసారి కీలక భేటీ
- Kareena Kapoor: కరీనా లాకెట్‌పై ఖురాన్ వచనాలు.. కాంగ్రెస్ నేత లీగల్ నోటీసులు!
- Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..
- Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!
టూరిస్ట్ వీసా పేరు విజిటర్ వీసాగా మార్పు
కొత్త నిబంధనల్లో ముఖ్యమైన మార్పు టూరిస్ట్ వీసా పేరును విజిటర్ వీసా (Visitor Visa)గా మార్చడం. పర్యాటకంతో పాటు మరికొన్ని స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రయాణ అవసరాలను కూడా ఇందులో చేర్చారు. ఈ వీసాను రెండు విభాగాలుగా విభజించారు.
V-1 Visa:
వ్యాపార సమావేశాలకు హాజరు కావడం
వైద్య సంప్రదింపులు
వెల్నెస్ రిట్రీట్స్
స్వల్పకాలిక వైద్య చికిత్స
భారతీయ భాషలు, సంగీతం, కళలు, హస్తకళలకు సంబంధించిన స్వల్పకాలిక కోర్సులు
ఈ వీసా 30 రోజుల కాలపరిమితితో మల్టిపుల్ ఎంట్రీ సదుపాయంతో జారీ అవుతుంది.
V-2 Visa:
V-1 కేటగిరీలోని ప్రయోజనాలతో పాటు పర్వతారోహణ వంటి కార్యకలాపాలకు కూడా ఈ వీసా వర్తిస్తుంది. అవసరాన్ని బట్టి ఒక సంవత్సరం, ఐదు సంవత్సరాలు లేదా పదేళ్ల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. పర్వతారోహణ కోసం ఆరు నెలల మల్టిపుల్ ఎంట్రీ వీసా జారీ చేస్తారు.
మెడికల్ వీసా నిబంధనల్లో మార్పులు
వైద్య చికిత్స కోసం భారత్‌కు వచ్చే విదేశీయుల కోసం మెడికల్ వీసా విధానాన్ని కూడా సరళీకృతం చేశారు. సంప్రదాయ వైద్య విధానాలు, ఆయుష్ చికిత్సలకు ప్రత్యేక విభాగాలను కొనసాగించారు.
M-1 Visa: ఆయుష్ చికిత్సలు మినహా ఇతర వైద్య చికిత్సల కోసం.
M-2 Visa: M-1 వీసా కలిగిన రోగులతో వచ్చే సహాయకుల కోసం.
M-3 Visa: ఆయుష్ వైద్య విధానాల్లో చికిత్స పొందేవారి కోసం.
M-4 Visa: M-3 వీసా కలిగిన రోగులతో వచ్చే సహాయకుల కోసం.
సాధారణంగా ఈ మెడికల్ వీసాలు, వాటి ఈ-వీసా వెర్షన్లు ఒక సంవత్సరం కాలపరిమితితో మల్టిపుల్ ఎంట్రీ సదుపాయంతో జారీ అవుతాయి. దీంతో విదేశీ రోగులు పదేపదే కొత్త వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం తగ్గుతుంది. తదుపరి వైద్య పరీక్షలు, ఫాలోఅప్ చికిత్సలు, వివిధ దశల్లో జరిగే వైద్య సేవల కోసం భారత్‌కు సులభంగా రావచ్చు. ఈ మార్పులు మెడికల్ టూరిజానికి కూడా ప్రోత్సాహం కల్పించనున్నాయి.
స్టూడెంట్ వీసా కేటగిరీలు ఇవే
భారత్‌లో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం స్టూడెంట్ వీసా విధానాన్ని రెండు ప్రధాన విభాగాలుగా మార్చారు.
S-1 Visa:
పాఠశాల స్థాయి విద్యతో పాటు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.
S-2 Visa:
PhD, పరిశోధక విద్యార్థులు, విజిటింగ్ ఫ్యాకల్టీ, విదేశీ పరిశోధకులు, శాస్త్రీయ, మానవ శాస్త్ర పరిశోధన యాత్రలు, ఇంటర్న్‌షిప్‌లు, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనేవారికి వర్తిస్తుంది. అలాగే Study in India పోర్టల్ ద్వారా భారతీయ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విదేశీ విద్యార్థులకు గరిష్టంగా ఐదేళ్లపాటు లేదా వారి విద్యా కోర్సు పూర్తయ్యే వరకు (ఏది ముందైతే అది) చెల్లుబాటు అయ్యే e-S1 వీసా జారీ చేసే అవకాశం ఉంటుంది. దీనికి మల్టిపుల్ ఎంట్రీ సదుపాయం కూడా ఉంటుంది.
బిజినెస్ వీసాల్లో కీలక మార్పులు
వ్యాపార అవసరాల కోసం భారత్‌కు వచ్చే విదేశీయుల వీసా విధానాన్ని కూడా రెండు విభాగాలుగా పునర్వ్యవస్థీకరించారు.
B-1 Visa: దీర్ఘకాలిక వ్యాపార కార్యకలాపాలు, లైసెన్స్ ఆధారిత వ్యాపారాలు, భారత్‌లో పారిశ్రామిక లేదా వాణిజ్య సంస్థలు స్థాపించాలనుకునే విదేశీయులకు వర్తిస్తుంది.
B-2 Visa: స్వల్పకాలిక, ఒప్పంద ఆధారిత వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడులకు సంబంధించిన ఉత్పత్తి కార్యకలాపాలు, సమావేశాలు, క్రీడలు, ప్రదర్శన కళలు, సినిమా రంగానికి సంబంధించిన పనులకు వర్తిస్తుంది.
అంతేకాకుండా భారతీయ కంపెనీల్లో పనిచేసేందుకు వచ్చే విదేశీ సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు, ప్రత్యేక నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. వీరు యంత్రాల ఏర్పాటు, పరికరాల నిర్వహణ, నాణ్యత తనిఖీలు, ఉత్పత్తి కార్యకలాపాలు, IT, ERP అమలు, ఉద్యోగులకు శిక్షణ, సరఫరా వ్యవస్థ అభివృద్ధి, ప్లాంట్ డిజైన్, సాంకేతిక సహాయం వంటి పనులు చేయవచ్చు. ఇలాంటి నిపుణులకు B-2 కేటగిరీ కింద Production Investment Business Visaను ఈ-వీసా విధానంలో జారీ చేయనున్నారు. గతంలో ఈ సదుపాయం e-B4 వీసా కేటగిరీలో ఉండేది.
వీసా అప్లికేషన్ ఫారాలు 70 శాతం వరకు తగ్గింపు
ఈ కొత్త మార్పుల్లో మరో ముఖ్యమైన అంశం వీసా దరఖాస్తు ఫారాల సరళీకరణ. మొత్తం 23 సబ్ కేటగిరీలకు సంబంధించిన అప్లికేషన్ ఫారాలను కేంద్ర హోం శాఖ సమీక్షించింది. ఈ క్రమంలో దరఖాస్తుల్లో అవసరమైన వివరాలు, కాలమ్‌ల సంఖ్యను 65 నుంచి 70 శాతం వరకు తగ్గించింది. దీంతో విదేశీయులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో తక్కువ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. అనవసరమైన సమాచారం, పత్రాల భారం తగ్గడంతో దరఖాస్తు ప్రక్రియ సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, వీసా పరిశీలన, ధృవీకరణకు అవసరమైన ముఖ్యమైన వివరాలను మాత్రం కొనసాగించనున్నారు.
భారత్‌లో ప్రస్తుతం ఉండబోయే 9 ప్రధాన వీసా కేటగిరీలు
కొత్త విధానం ప్రకారం భారతదేశంలో ప్రధానంగా తొమ్మిది వీసా కేటగిరీలు ఉంటాయి.
Business Visa – వ్యాపార వీసా
Diplomatic Visa – దౌత్య వీసా
Work Visa – ఉద్యోగ వీసా
Journalist Visa – జర్నలిస్ట్ వీసా
Medical Visa – వైద్య వీసా
Official Visa – అధికారిక వీసా
Student Visa – విద్యార్థి వీసా
Visitor Visa – సందర్శకుల వీసా
Miscellaneous Visa – ఇతర ప్రత్యేక అవసరాల వీసా
Miscellaneous Visa విభాగంలో ఇతర కేటగిరీల్లోకి రాని ప్రత్యేక ప్రయాణ అవసరాలను చేర్చారు. భారత సంతతికి చెందిన వ్యక్తులు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, కొన్ని ప్రత్యేక సంస్థల్లో చేరేవారు, దీర్ఘకాలిక వీసాలు కలిగిన విదేశీయులపై ఆధారపడినవారు వంటి వారికి సంబంధించిన నిబంధనలు ఇందులో ఉంటాయి. అఫ్గాన్ పౌరులకు స్టే వీసాలు, పొరుగు దేశాలకు చెందిన కొన్ని వర్గాల వారికి దీర్ఘకాలిక వీసాలు కూడా ఇందులో ఉన్నాయి.
కొత్త వీసా నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి?
కొత్త వీసా విధానాన్ని అమలు చేసేందుకు కేంద్ర హోం శాఖ ప్రస్తుతం తన సమాచార సాంకేతిక వ్యవస్థలను (IT Systems) అప్డేట్ చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2026 చివరి నాటికి కొత్త విధానంలో వీసాల జారీ ప్రారంభమవుతుందని హోం శాఖ వెల్లడించింది.
తాజావార్తలు
-
India New Visa Rules 2026: భారత్‌లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్‌కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
-
వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!