Abhinandan Vardhaman: పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్తాన్‌పై ఎయిర్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి బాలాకోట్, ఇతర ఉగ్రవాదుల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఆ తర్వాతి రోజు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన విమానాలు భారత్‌పై దాడి చేసేందుకు రాగా.. మన ఎయిర్ ఫోర్స్ వాటిని వెంబడించాయి. ఈ నేపథ్యంలోనే వింగ్ కమాండర్ గా ఉన్న అభినందన్ వర్థమాన్ తన మిగ్-21 బైసన్ విమానంతో పాక్‌కి చెందిన అత్యాధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చేశాడు. ఈ ఘర్షణలో మిగ్ కూలిపోయింది. అభినందన్ వర్థమాన్ పారాశ్యూట్ సాయంతో పాకిస్థాన్ భూభాగంలో సురక్షితంగా దిగినా..అక్కడి సైన్యం చేతికి చిక్కాడు.
ఈ నేపథ్యంలో అభినందన్‌ని తిరిగి భారత్ రప్పించేందుకు భారత్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ వైపు ఏకంగా 9 క్షిపణులను గురిపెట్టినట్లు అప్పటి పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్ అజయ్ బసారియా వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 27 రాత్రి పాక్ వైపు ఇండియా 9 క్షిపణుల్ని గురిపెట్టింది. దీంతో చాలా భయపడిపోయిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, నరేంద్రమోడీతో మాట్లాడాలనుకున్నారు. అయితే ప్రధాని మోడీ అందుకు నిరాకరించినట్లు ఆయన తన పుస్తకంలో వెల్లడించారు.
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌజ్‌లోకి ఇద్దరు అపరిచితులు..
ఆ రోజు అర్ధరాత్రి బిసారియాకు అప్పటి పాకిస్తాన్ హైకమిషనర్ సోహైల్ మహమూద్ నుండి కాల్ వచ్చిందని, అప్పుడు తాను ఢిల్లీకి ఫోన్ చేసి, ప్రస్తుతం ప్రధాని మోడీ చర్చలకు అందుబాటులో లేరని, అవసరమైతే తమ మెసేజ్‌ని హైకమిషనర్ ద్వారా చేయవచ్చని చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత బిసారియా మళ్లీ మహమూద్‌తో మాట్లాడలేదు.
ఫిబ్రవరి 28న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అభినందన్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. శాంతి కోసం ప్రధాని నరేంద్రమోడీతో మాట్లాడేందుకు పాక్ ప్రయత్నించింది. అయితే అభినందన్ వర్థమాన్ విడుదలను శాంతి కోసం అన్నట్లుగా పాక్ చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అభినందన్‌కి ప్రాణహాని తెస్తే భారత్ నుంచి తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్తాన్‌కి అమెరికా, బ్రిటన్ రాయబారులతో సహా పాశ్చాత్య దేశాల దౌత్యవేత్తలు వెల్లడించడంతో పాక్ మోకాళ్లపై కూర్చోవాల్సి వచ్చింది.