India On Indus Waters: సింధు జలాల ఒప్పందం (IWT) విషయంలో పాకిస్తాన్ అంతర్జాతీయంగా గగ్గోలు పెడుతోంది. పలువురు విదేశీ రాయబారులతో ఈ విషయాన్ని లేవనెత్తుతోంది. మరోవైపు, పాక్ నేతలు భారత్‌ను, భారత నేతల్ని హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింధు జలాల విషయంలో తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని భారత్ చెప్పింది. సరిహద్దులో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరు పాకిస్తాన్‌కు ఎలాంటి నీరు ఇచ్చేది లేదని చెప్పింది. అప్పటి వరకు ఈ ఒప్పందాన్ని ‘‘నిలిపేవేత స్థితి’’లో ఉంటుందని స్పష్టం చేసింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 2025లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత భారత్ సింధు జలాలను నిలిపివేసింది. అప్పటి నుంచి తమకు నీరు ఇవ్వడం లేదని అంతర్జాతీయ సమాజానికి భారత్‌పై పాకిస్తాన్ ఫిర్యాదు చేస్తోంది. సింధు జలాల కోసం సింధూ లోయ నాగరికత అసలు వారసులము తామే అంటూ ఒక కొత్త ప్రచారానికి తెర తీసింది. పాక్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ.. సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపేంత వరకు ఏమీ మారదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ రోజు పాకిస్థాన్‌కు గుర్తుచేసింది.
“సింధు జలాల ఒప్పందంపై భారత్ వైఖరి స్థిరంగా ఉంది. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతరం మద్దతు ఇస్తున్నందున IWT నిలిపివేయబడిన స్థితిలోనే ఉంది. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి తన మద్దతును విశ్వసనీయంగా మరియు తిరుగులేని విధంగా విరమించుకోవాలి,” అని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో అన్నారు.
సింధు జలాల విషయంలో ఇటీవల పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మాట్లాడుతూ.. భారత నిర్ణయాన్ని పాక్ తిరస్కరించిందని అన్నారు. ఇదే కార్యక్రమంలో పాక్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. “పాకిస్థాన్ అణు బాంబులు కేవలం ప్రదర్శన కోసం ఉద్దేశించినవి కావు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలన్నీ విఫలమైతే, పాకిస్థాన్ అణు ఆప్షన్‌ను పరిశీలించాల్సి ఉంటుంది.” అని హెచ్చరించే ప్రయత్నం చేశారు.

