Gen Z Protest: ‘‘ మా దేశంలో బిర్యానీ ప్లేట్‌కే అమ్ముడుపోతారు’’.. భారత యువతపై పాకిస్తాన్ యూత్ ప్రశంసలు..

  • భారత యువత ఉద్యమంపై ప్రశంసలు..
  • పాక్, నేపాల్, శ్రీలంక యువత పొగడ్తలు..
Neet Protest

Neet Protest

Gen Z Protest: నీట్ పేపర్ వివాదం నేపథ్యంలో భారత యువత, విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఉద్యమించారు. ఎట్టకేలకు దేశ Gen Z నిరసనలకు తలొగ్గి ఆయన రాజీనామా చేశారు. అయితే, ఈ ఉద్యమంపై మన దేశ సరిహద్దు దేశాల్లోని యువత ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్తాన్‌లోని యూత్, భారత యువతను తెగ ప్రశంసిస్తున్నారు. పాక్‌తో పాటు శ్రీలంక, నేపాల్‌కు చెందిన నెటిజన్లు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ యాక్టివిస్టులు భారత యువతను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

జంతర్ మంతర్ ఉద్యమంలో మీమ్స్, రీల్స్, సోషల్ మీడియా ప్రచారం కీలక పాత్ర పోషించాయని, ఈ ఉద్యమాన్ని ప్రత్యేకంగా నిలబెట్టిందని కొనియాడారు. పాకిస్తాన్‌కు చెందిన ఓ యువతి బీబీసీతో మాట్లాడుతూ.. ‘‘భారత్ Gen Z చేస్తున్నది చూస్తుంటే వారిని ద్వేషించడం కష్టమవుతోంది’’ అని అన్నారు. పాక్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ స్పందిస్తూ.. ‘‘ఈ ఉద్యమానికి పాకిస్తాన్ నుంచి నిధులు వచ్చాయని కొందరు అంటున్నారు. మా దేశాన్నే నడపడానికి డబ్బులు లేవు. మేమెలా నిధులు ఇస్తాం.?’’ అని వ్యాఖ్యానించారు. ‘‘మా దగ్గర బిర్యానీ ప్లేట్‌కే ప్రజలు అమ్ముడుపోతారు’’ అని అన్నారు.

నేపాల్ కంటెంట్ క్రియేటర్ అవినాశ్ మిశ్రా, భారత విద్యార్థుల ఆవేదనను తక్కువ అంచనా వేయొద్దని, వారి పోరాటానికి స్పష్టమైన లక్ష్యం ఉందని అన్నారు. శ్రీలంకలో 2022 యువత ఉద్యమంలో పాల్గొన్న బువనక పెరెరా కూడా భారత యువతకు మద్దతు తెలిపారు. ‘‘ పోరాటం కొనసాగించండి’’ అంటూ మెసేజ్ ఇచ్చారు.

ఇటీవల సంవత్సరాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లో యువత, విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనాను గద్దె దించారు. ఇక నేపాల్‌లో కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఉద్యమించి ప్రభుత్వం మొత్తం అధికారానికి రాజీనామా చేసే వరకు వదలలేదు. ఇక శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్సకు వ్యతిరేకంగా పోరాడారు. చివరకు రాజపక్స తప్పించుకుని పారిపోయే దాకా యువత వదలలేదు.