Site icon NTV Telugu

Rare earth elements: భారత్‌కు భారీ జాక్‌పాట్.. ఏకంగా మిలియన్ టన్నుల “అరుదైన ఖనిజాలు”..

Rare Earths

Rare Earths

Rare earth elements: ప్రస్తుతం, ప్రపంచ జియోపాలిటిక్స్ ‘‘రేర్ ఎర్త్ ఎలిమెంట్స్’’ చుట్టూ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ అరుదైన భూ ఖనిజాల వెలికితీత, వీటి ద్వారా రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీలో చైనా గుత్తాధిపత్యం ఉంది. అయితే, ఇప్పుడు అమెరికా కూడా రేర్ ఎర్త్స్ కోసం అన్వేషిస్తోంది. ఉక్రెయిన్‌తో డీల్ అయినా, పాకిస్తాన్‌తో స్నేహమైన ఈ ఖనిజాల కోసమే. ఎలక్ట్రిక్ వాహన ఇండస్ట్రీ నుంచి క్షిపణులు, శాటిలైట్ల తయారీలో ఇవి కీలకంగా మారడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం పోటీ నెలకొంది. ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తోంది.

Read Also: Ind vs NZ 3rd T20I: భారత్ బౌలర్ల ధాటికి కివీస్ విలవిలా.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత్ భారీ జాక్‌పాట్ కొట్టింది. కర్ణాటకలో చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటలో భారీగా ‘‘రేర్ ఎర్త్ ఖనిజాల’’ నిల్వలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దేశ ఖనిజ సంపద, వ్యూహాత్మక స్వావలంబనకు ఇవి కీలకం కానున్నాయి. ప్రాంతంలో 63.5 లక్షల టన్నుల అరుదైన భూమి మూలకాలు, యట్రియం భారీ నిల్వలు గుర్తించబడ్డాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU) భూగర్భ శాస్త్ర విభాగం శాస్త్రవేత్తలు వీటిని గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రాథమిక అంచనాలు కూడా వీటికి మద్దతు ఇస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ పరికరాలు, ఏరోస్పేస్, విండ్ టర్బైన్‌లు, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఆధునిక పరిశ్రమలలో రేర్ ఎర్త్ మూలకాలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం, వీటి కోసం భారత్ చైనాపై ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో వీటిని గుర్తించడం భారత వ్యూహాత్మక, సాంకేతిక స్వావలంబనకు ఈ ఆవిష్కరణ దోహదపడనునంది.

గుండ్లుపేట ప్రాంతంలో అరుదైన కార్బోనటైట్ సైనైట్ సముదాయాన్ని గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఈ రేర్ ఎర్త్ నిల్వలు 2.5 బిలియన్ ఏళ్ల సంవత్సరాల కన్నా పురాతనమైనవి. మొదటిదశలో గులాబీ రంగు సైనైట్ శిలలు ఏర్పడ్డాయని, దాదాపు 12 కోట్ల సంవత్సరాల తర్వాత, రెండో దశలో తెల్లని కార్బోనాటైట్ శిలలు అంతర్గతంగా ప్రవేశించినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రాంతంలో సీరియం, లాంథనం, నయోబియం, ఫాస్పరస్ వంటి విలువైన రేర్ ఎర్త్ మూలకాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతదేశంలో ఇప్పటికే గుజరాత్ (అంబా డోంగర్), రాజస్థాన్ (న్యువానియా), తమిళనాడు (హోగెనక్కల్, సేవత్తూర్), మేఘాలయ (సంగ్ వ్యాలీ) వంటి ప్రాంతాల్లో కూడా కార్బోనాటైట్ సముదాయాలు ఉన్నాయి.

Exit mobile version