తాలిబన్లతో ఆచరణాత్మక సంబంధాలను కోరుకుంటున్నట్లు భారత్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. అంతర్జాతీయ చట్టాలను భారత్ గౌరవిస్తుందని తెలిపారు. ఆప్ఘనిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. చిన్నారులు, మహిళలు, క్రికెటర్లపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న ఆప్ఘనిస్థాన్‌పై బహిరంగ బెదిరింపులు, యుద్ధ చర్యలు అంతర్జాతీయ చట్టా్ని ఉల్లంఘించడమేనని చెప్పుకొచ్చారు.
ఆప్ఘనిస్థాన్ ప్రజలకు స్థిరమైన ప్రయోజనాలు చేకూరేలా సహాయపడాలని ఐక్యరాజ్యసమితిని, అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు తెలిపారు. 2025లో ఆప్ఘనిస్థాన్‌లో 6 శాతం జనాభా వృద్ధి కనిపిస్తోందని.. దీంతో గణనీయమైన దుర్బల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. వారికి మెరుగైన రక్షణ, మెరుగైన ఆశ్రయం, ఆహార భద్రత అవసరం అని చెప్పారు. ఆప్ఘనిస్థాన్‌లో భద్రతా పరిస్థితిని భారత్ నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని తెలిపారు.
ఇక ఐఎస్ఐఎల్, అల్ ఖైదా, వాటి అనుబంధ సంస్థలు, లష్కరే తయ్యిబా, జైషే-ఎ-మహమ్మద్, రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి ఎల్‌ఇటి ప్రాక్సీలు ఇకపై సరిహద్దు ఉగ్రవాదంలో పాల్గొనకుండా ఉండేలా అంతర్జాతీయ సమాజం ప్రయత్నాలను సమన్వయం చేసుకోవాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్ కోరింది.
